Toxic: 'టాక్సిక్' ఈవెంట్‌లో విషాదం..మల్లారెడ్డి కోడలు షాకింగ్ కామెంట్స్!
Toxic: మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యశ్ ‘టాక్సిక్’ మూవీ ఈవెంట్‌లో ఫ్లడ్ లైట్ స్తంభం కూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
Toxic: 'టాక్సిక్' ఈవెంట్‌లో విషాదం..మల్లారెడ్డి కోడలు షాకింగ్ కామెంట్స్!
Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఘనంగా ప్రారంభమైనప్పటికీ, చివరకు తీవ్ర ఉద్రిక్తతలకు, వివాదాలకు వేదికగా మారింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, విద్యార్థుల కోలాహలంతో హడావుడిగా సాగిన ఈ కార్యక్రమంలో ఒకవైపు ఘోర ప్రమాదం జరగగా, మరోవైపు యాజమాన్య ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి.
కార్యక్రమానికి విద్యార్థులు, యశ్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వేదిక ముందు రద్దీ ఎక్కువ కావడంతో, హీరో యశ్ మాట్లాడే సమయంలో కొంతమంది యువకులు గ్రౌండ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ స్టాండ్‌పైకి ఎక్కారు. బరువు ఎక్కువ కావడంతో ఆ స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలి కింద ఉన్న విద్యార్థులపై పడింది. స్తంభం కింద పడటంతో పలువురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ హఠాత్ పరిణామంతో గ్రౌండ్‌లో ఒక్కసారిగా త్రొక్కిసలాట లాంటి వాతావరణం నెలకొని, తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ప్రమాదం ఒకవైపు ఆందోళన కలిగిస్తే, ఈవెంట్ ప్రారంభంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మన క్యాంపస్‌లో మళ్లీ ఇలాంటి పెద్ద ఈవెంట్స్ జరగాలంటే మీ బిహేవియర్ సరిగ్గా ఉండాలి. మల్లారెడ్డి పేరు నిలబెట్టాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇకపై ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ముందు మీరు సరిగ్గా ప్రవర్తించడం నేర్చుకోండి అని సీరియస్ హెచ్చరికలు చేశారు.
ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా భద్రతా చర్యలు, కనీస ప్లానింగ్ లేకుండా వేలాది మందిని గ్రౌండ్‌లోకి అనుమతించి, ప్రమాదాలు జరిగినప్పుడు విద్యార్థుల ప్రవర్తనను తప్పుపట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. సినిమా ఈవెంట్లకు క్యాంపస్‌ను అడ్డాగా మార్చి, డిసిప్లిన్ గురించి క్లాసులు పీకడం విడ్డూరంగా ఉంది. నిజమైన టాక్సిక్ బిహేవియర్ యాజమాన్యానిదే అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఒకవైపు ఫ్లడ్ లైట్ కూలి విద్యార్థులు గాయపడటం, మరోవైపు యాజమాన్యం బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం ఈ ఈవెంట్‌ను తీవ్ర వివాదాస్పదంగా మార్చాయి. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇలాంటి భారీ ఈవెంట్లు నిర్వహించడంపై ఇప్పుడు పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.




