Bigg Boss 10: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రీ-ఎంట్రీ.. త్రిగుణ్, చరణ్ మధ్య హైఓల్టేజ్ వార్
Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో తాజా ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరంగా సాగాయి
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్‌బాస్ హౌస్‌లో తాజా ఎపిసోడ్స్ అత్యంత ఆసక్తికరంగా సాగాయి. ఉదయం పూట కంటెస్టెంట్లు అందరూ ఊ అంటావా మావా పాటకి హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా రోజును ప్రారంభించారు. ముఖ్యంగా వర్షిణి వేసిన స్టెప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రోహిత్, షాలిని, సృష్టి తదితరులు హౌస్‌లో వంశీ, సుధీర్ ప్రవర్తన గురించి డిస్కషన్ పెట్టారు. సుధీర్ పనులు చేయడం, ఎవరితోనూ గొడవ పడకుండా ఉండటాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆయిల్ వినియోగం విషయంలో వంశీ మాట్లాడిన మాటలకు వర్షిణి హర్ట్ అయ్యి ఏడ్చేయడం హౌస్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణాన్ని కలిగించింది.
కెప్టెన్సీ రేసులో త్రిగుణ్, రాంప్రసాద్ మధ్య ఉత్కంఠ
ఇక ఆటలో భాగంగా కెప్టెన్సీ రేసు కోసం ప్రత్యేకంగా టాస్క్‌లు నిర్వహించారు. త్రిగుణ్, రాంప్రసాద్, దేబ్‌జానీలు ఈ రేసులో పోటీ పడగా.. చివరికి దేబ్‌జానీ చిన్న పొరపాటు వల్ల ఓడిపోయి రేస్ నుంచి తప్పుకుంది. మరోవైపు హౌస్‌లో రోహిత్, త్రిగుణ్‌లు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. మనిద్దరం కలిస్తే ఎవరూ మనల్ని ఆపలేరంటూ ఇద్దరూ కలిసి కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. అయితే ఈ పొత్తు ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
చరణ్ వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ
ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇచ్చిన అతి పెద్ద ట్విస్ట్ చరణ్ రీ-ఎంట్రీ. తొలివారంలోనే ఎలిమినేట్ అయిన చరణ్.. పవర్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ ద్వారా మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. రాక్షసుల గెటప్‌లో వచ్చిన కొందరు వ్యక్తులు షాలినిని శవపేటిక తరహాలో బయటకు తీసుకెళ్తుండటంతో అందరూ ఆమె ఎలిమినేట్ అయ్యిందని భయపడ్డారు. కానీ ముసుగు తీసి చూసేసరికి చరణ్ ప్రత్యక్షం కావడంతో కంటెస్టెంట్లందరూ షాక్ అయ్యారు. బిగ్‌బాస్ చరణ్‌కి ఇది పునర్జన్మ లాంటిదంటూ కొత్తగా ఆడాలని సూచించారు. బయట నుంచి ఆటను చూసి వచ్చిన చరణ్ హౌస్‌లోకి రాగానే తనదైన శైలిలో గేమ్‌ను మొదలుపెట్టాడు.
త్రిగుణ్‌తో చరణ్ ఛాలెంజ్
హౌస్‌లోకి తిరిగి వచ్చిన చరణ్‌కు బిగ్‌బాస్ ఒక ప్రత్యేక అధికారం ఇచ్చారు. అందులో భాగంగా చరణ్.. ఇప్పటికే కెప్టెన్సీ రేసులో ఉన్న త్రిగుణ్‌ను ఛాలెంజ్ చేశాడు. త్రిగుణ్ ఎక్కువ మాట్లాడుతాడని, అతనికి కెప్టెన్ అయ్యే అర్హత లేదని వాదిస్తూ అతనితో పోటీకి దిగాడు. ఇద్దరి మధ్య పాథ్ ఆఫ్ పవర్ గేమ్ జరగగా.. చరణ్ స్మార్ట్‌గా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ, కొన్ని రూల్స్ ఫాలో కాకపోవడంతో బిగ్‌బాస్ త్రిగుణ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో త్రిగుణ్ తన కెప్టెన్సీ కంటెండర్ స్థానాన్ని కాపాడుకోగా, చరణ్ వేసిన వ్యూహం బెడిసికొట్టింది.




