Upendra: ఈ సినిమా అర్ధం కావాలంటే ఎలా చూడాలి... అందుకే ఉపేంద్ర అయ్యాడు

ఉపేంద్ర సినిమా అసలు అర్థం ఏమిటి? మనిషిలోని అహంకారం, స్వార్థం, కామం, ఆశలను ప్రతిబింబించిన ఈ సైకాలజికల్ మాస్టర్‌పీస్ ఎందుకు ప్రత్యేకమైందో తెలుసుకుందాం.

Balachander
Published on: 20 Jun 2026 3:10 PM IST
Upendra: ఈ సినిమా అర్ధం కావాలంటే ఎలా చూడాలి... అందుకే ఉపేంద్ర అయ్యాడు
X

Upendra: సినిమా అంటే వినోదం. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకోవడానికి, ఆనందంగా ఉండేందుకు సినిమా అంటారు. అయితే, ఈ వినోదం కూడా అప్పుడప్పుడు మనలోని గుణాలను బయటపెడుతుంటుంది. మనల్ని మనం ఆలోచించుకునేలా చేస్తుంది. అవసరమైతే మనల్ని మనం అసహ్యించుకునేలా కూడా చేస్తుంది. మనలోని తప్పొప్పులను తెలుసుకునేలా చేస్తుంది. ఇలాంటి సినిమాల్లో ఒకటి ఉపేంద్ర. సినిమా చూస్తున్నంత సేపు ఏం చూస్తున్నామో, ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. ఈ సినిమాలో హీరో పాత్రకు అసలు పేరు ఉండదు. అతడ్ని నేను నేను అని పిలుస్తుంటారు. నేను అంటే ఎవరు? మనలోని అహం. అహం చేసే అరాచకమే ఉపేంద్ర.

మరో మనిషికి నిదర్శనం

సినిమాలను ఇలా కూడా తీయవచ్చా అనే ఆలోచన కలిగించేలా చేసింది ఉపేంద్ర. మనలోపలి వికృత ధోరణిని బయటపెట్టే సినిమానే ఉపేంద్ర. ఇంకా పచ్చిగా కూడా చెప్పవచ్చు. గుడ్డలు ఊడదీసి కడిగిపడేసిన సినిమా ఇది. మనిషిలోని స్వార్ధం, ఆశ, కామం, గర్వం, కీర్తి, కాంక్ష అన్నింటికీ మూలమే అహం. అహం పెరిగితే అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారమే ఉపేంద్ర. సమాజంలో కనిపించే ప్రతి మనిషిలోనూ చంచలమైన, వికారమైన ఆలోచనలు ఉంటాయి. కానీ, వాటిని బయటకు కనబడనివ్వకుండా ముసుగుతో మంచివాడిలా పైకి కనిపిస్తాడు. కనిపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉపేంద్ర లాంటి సినిమాలు మరలా వచ్చాయా అంటే రాలేదని చెప్పాలి. ఒక విధంగా ఈ సినిమా హ్యూమన్‌ సైకలాజికల్‌ మూవీ అనే చెప్పాలి. కుటుంబ సమేతంగా చూడాలంటే ఆరోజుల్లో భయం. ఎందుకంటే పచ్చిగా ఉండేలా ఈ సినిమాను నాటి సమాజం ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడుంతా ఒపెనప్‌ అయిపోయింది. సినిమాల్లో మాటల నుంచి ధారణ వరకు కల్చర్‌ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా చూస్తే మనలో తెలియకుండానే ఓ రివెల్యూషన్‌ మొదలౌతుంది.

గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌..ఉపేంద్ర

పేదలకు, అనాధలకు, ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేయలేని దేవుడు గుడిలో ఉండి ఏం చేస్తున్నాడు అని చెబుతూ గన్‌ పట్టుకొని నానా హంగామా చేస్తూ... ఆధునిక సమయంలో అందరికీ అన్నీ కల్పించాలనే ఆశయం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. సమాజంలో బట్టలకు, రంగులకు ఉన్న ప్రాధాన్యత లోపలున్న మనసుకు ఉండదని, మనసు ఎంత కల్మషంగా ఉన్నా మంచి బట్టలు వేసుకుంటే సమాజంలో గౌరవం దక్కుతుందని చెప్పే సన్నివేశం, వ్యర్థంగా భార్యభర్తలు తిట్టుకుంటూ కొట్టుకుంటూ పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రులకు ఉపేంద్ర చెప్పిన గుణపాఠం, ఊరికే ఖాళీగా కూర్చొనే కంటే చచ్చిపోవడం ఉత్తమం అని చెప్పిన తీరు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆరోజుల్లో వచ్చిన ఒక రివెల్యూషన్‌ సినిమాగా ఉపేంద్రను చెప్పవచ్చు. అదే ఈ రోజుల్లో కనుక ఈ సినిమా వచ్చి ఉంటే దాని రేంజ్‌ మరోలా ఉండేది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story