Pawan Kalyan : 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణ ప్రభుత్వం షాక్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతిచ్చింది. తెలంగాణలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో టికెట్ ధరల పెంపునకు లైన్ క్లియర్ అయింది.
Pawan Kalyan : 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తెలంగాణ ప్రభుత్వం షాక్
Ustaad Bhagat Singh : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు వీరిద్దరూ కలిసి వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇప్పుడు ఈ చిత్రం కేవలం థియేటర్ల వద్దే కాదు, ప్రభుత్వ అనుమతులు, కోర్టు తీర్పుల పరంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, కోర్టులు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో క్లియర్.. స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరిక మేరకు మార్చి 19న తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంతేకాదు, బెనిఫిట్ షో టికెట్ ధరను రూ. 500 (పన్నులతో సహా)గా నిర్ణయించింది.రెగ్యులర్ షోల విషయానికి వస్తే, ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ ధరలు మార్చి 19 నుంచి మార్చి 28 వరకు, అంటే పది రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆటంకం లేకుండా అనుమతులు ఇవ్వడంతో, ఉస్తాద్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తెలంగాణలో సుప్రీం ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో ఒకచోట సానుకూల వాతావరణం ఉంటే, తెలంగాణలో పరిస్థితి కొంత గందరగోళంగా ఉంది. గతంలో టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, టికెట్ ధరలు పెంచాలంటే 90 రోజుల ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి అనే కఠిన నిబంధనను న్యాయస్థానం విధించింది. ఇది పెద్ద సినిమాల విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, హైకోర్టు విధించిన ఆ 90 రోజుల నిబంధనపై స్టే విధించింది. గతంలో ఉన్న పాత విధానాన్నే కొనసాగించాలని సూచించడంతో, తెలంగాణలోనూ టికెట్ ధరల పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై అధికారిక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ అంచనాల 'ఉస్తాద్'
మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. హరీశ్ శంకర్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, పవన్ కళ్యాణ్ స్టైల్ కలబోతగా వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఉగాది పర్వదినాన థియేటర్లలో 'ఉస్తాద్' రచ్చ ఎలా ఉండబోతుందో చూడాలి.




