Vemuri Gaggaiah: తొలితరం మహా ప్రతినాయకుడు...నేటి విలనిజానికి ఆదర్శనీయుడు
రంగస్థలంలో రాణించిన వేమూరి గగ్గయ్య తొలితరం విలన్‌గా వెండితెరపై మెరుపులు మెరిపించాడు. విలనిజానికి బాటలు వేశాడు.
Vemuri Gaggaiah: తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులైన విలన్లకు కొదువ లేదు. కానీ, వెండితెరపై విలనిజానికి ఒక ప్రత్యేక శైలిని, రాజసాన్ని నూరిపోసి, తరువాతి తరాలకు దిశానిర్దేశం చేసిన తొలి తరం 'మహా ప్రతినాయకుడు' వేమూరి గగ్గయ్య. గంభీరమైన కంఠస్వరం, స్పష్టమైన పద్య పఠనం, పాత్రలో లీనమయ్యే అద్భుత నటనా వైదుష్యంతో నాటకరంగం నుండి వెండితెర వరకు ఆయన సృష్టించిన ప్రభంజనం అపూర్వం. ఎస్.వి. రంగారావు, గుమ్మడి వంటి దిగ్గజ నటులకు సైతం పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన నటన ఆయన సొంతం.
రంగస్థలం నుంచి వెండితెర దాకా సంచలనం
1895 ఆగస్టు 15న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించిన వేమూరి గగ్గయ్య, చిన్ననాటి నుంచే నాటకాలపై ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. యముడు, హిరణ్యకశిపుడు, కంసుడు, రావణుడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి అత్యంత గంభీరమైన పాత్రలలో ఆయన అభినయించిన తీరు చూసి ప్రేక్షకులు భయంతో పాటు ముగ్ధులయ్యేవారు. రంగస్థలంపై మెరుపులు మెరిపించిన గగ్గయ్య... 1933లో వచ్చిన ‘సావిత్రి’ చిత్రంతో తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత శ్రీకృష్ణ లీలలు, సీతాకల్యాణం, భక్త మార్కండేయ, మహిరావణ, చండిక వంటి అనేక మైలురాయి చిత్రాల్లో అద్భుత నటన కనబరిచారు. కేవలం నటుడిగానే కాక, సంగీత పరిజ్ఞానం ఉన్న కళాకారుడిగా రంగస్థలంపై, సినిమాల్లో పద్యాలను రాగయుక్తంగా పాడుతూ భావోద్వేగాలను పండిచేవారు. ఆ రోజుల్లో సొంతంగా పద్యాలు పాడుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
విలనిజానికి ఆదర్శనీయుడు
విలన్ పాత్ర అంటే కేవలం క్రూరత్వం మాత్రమే కాదని, అందులో ఒక గాంభీర్యం, రాజసం ఉంటాయని నిరూపించిన మహానటుడు ఆయన. నాటకరంగ వైభవాన్ని వెండితెరకు అనుసంధానించిన తొలి నటులలో గగ్గయ్య అగ్రతాంబూలం అందుకుంటారు. 1955 డిసెంబర్ 30న ఆయన భౌతికంగా మనల్ని విడిచివెళ్లినప్పటికీ, తెలుగు సినీ చరిత్రలో తొలి 'మహా ప్రతినాయకుడిగా' ఆయన వేసిన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేటికీ పౌరాణిక లేదా చారిత్రక విలనిజం గురించి చర్చ వస్తే వేమూరి గగ్గయ్య పేరే మొదట గుర్తుకువస్తుంది. ఆయన చూపిన బాటలో ఆనాటి విలన్‌లుగా పేరుగాంచిన నటులు, నేటి విలన్‌గా రాణిస్తున్న నటులకు ఇన్ఫిరేషన్ గగ్గయ్య అనే చెప్పాలి.




