వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ!

జానపద గాయనీ కోమలి నిర్మాతగా పరిచయమవుతూ నిర్మించిన తొలి చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 July 2026 10:35 PM IST
Venkatramaiah Gari Taluka Movie Review
X

వెంకట్రామయ్య గారి తాలూకా’ మూవీ రివ్యూ!

Venkatramaiah Gari Taluka Movie Review: జానపద గాయనీ కోమలి నిర్మాతగా పరిచయమవుతూ నిర్మించిన తొలి చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. దినేష్ కుమార్ హీరోగా, ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలకు ముందే టీజర్, పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలతో కూడిన భావోద్వేగ కథగా ప్రచారం పొందడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను 'వెంకట్రామయ్య గారి తాలూకా' ఎంతవరకు అందుకుంది? ప్రేక్షకుల హృదయాలను తాకే కుటుంబ కథగా నిలిచిందా? కొత్త హీరో-హీరోయిన్లు ఎంత మేర ఆకట్టుకున్నారు? తెలుసుకుందాం... ఈరోజు రివ్యూ రిపోర్టులో.

కథ:

పిల్లలే ప్రాణంగా భావించే ఓ మధ్యతరగతి తండ్రి

వెంకట్రామయ్య (మురళీ గౌడ్ ). ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు. పిల్లల ప్రేమ పెళ్లిళ్లను కూడా ఒప్పుకొని, వారి కోసం తన భూములను కూడా త్యాగం చేస్తాడు. కాలంతో మారిపోయిన మానవ సంబంధాలు... వృద్ధాప్యంలో తల్లి, ఆ తర్వాత తండ్రి ఎదుర్కొనే వేదన.. ఈ భావోద్వేగాల సమాహారమే 'వెంకట్రామయ్య గారి తాలూకా'. కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల ప్రేమ, ఆడపిల్ల జీవితం, మనిషి ఆత్మగౌరవం వంటి అంశాలను గ్రామీణ నేపథ్యంలో హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, నేటి సమాజంలో కనుమరుగవుతున్న అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రతి ప్రేక్షకుడి మనసును కదిలించే ప్రయత్నం చేస్తుంది.

నటీనటుల ప్రతిభ

దినేష్ కుమార్ (హీరో):

ఈ సినిమాతో హీరోగా పరిచయమైన దినేష్ కుమార్ తొలి చిత్రమైనప్పటికీ మంచి నటనను కనబరిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన హావభావాలు ఆకట్టుకుంటాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకునే సామర్థ్యం ఉన్న నటుడిగా కనిపించారు.

దివిజ ప్రభాకర్ (హీరోయిన్):

ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమానే అయినప్పటికీ చాలా సహజంగా నటించారు. అమాయకత్వం, భావోద్వేగ సన్నివేశాల్లో మంచి అభినయాన్ని ప్రదర్శించారు.

మురళీధర్ గౌడ్:

ఈ చిత్రానికి అసలు బలమే మురళీధర్ గౌడ్ పాత్ర. తండ్రిగా ఆయన నటన ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది. ఆయన పలికే ప్రతి డైలాగ్, ప్రతి భావోద్వేగ సన్నివేశం సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

సుధ:

తల్లి పాత్రలో సుధ తన అనుభవాన్ని మరోసారి నిరూపించారు. సహజమైన నటనతో కుటుంబ భావోద్వేగాలను మరింత బలంగా మలిచారు.

కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఎలా ఉందంటే...

ఇటీవలి కాలంలో యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో పూర్తిగా కుటుంబ విలువలతో రూపొందిన చిత్రంగా 'వెంకట్రామయ్య గారి తాలూకా' ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్న మనుషులు.. క్రమంగా దూరమవుతున్న కుటుంబ బంధాలు... వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో ఓ మధ్యతరగతి తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలే 'వెంకట్రామయ్య గారి తాలూకా' కథకు మూలాధారం.

పిల్లలే తన ప్రపంచంగా భావించే ఓ తండ్రి.. ముఖ్యంగా తన కూతురి జీవితాన్ని బాగు చేయాలనే తపనతో ఎలాంటి కష్టాలనైనా భరిస్తాడు. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, మానవ సంబంధాల విలువలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు.

ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు.. నేటి సమాజానికి అద్దం పట్టే భావోద్వేగ ప్రయాణం. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, వారి కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవనశైలిని పరిచయం చేస్తుంది. ఆ తరువాత కథ భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. రెండో భాగంలో వచ్చే తండ్రి-కూతుళ్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించే స్థాయిలో ఉంటాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్య సంభాషణలు లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రూపొందించారు.

దర్శకుడి పనితీరు:

దర్శకుడు సతీష్ ఆవాల మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతిరోజూ జరిగే సంఘటనలను ఎంతో సహజంగా తెరకెక్కించారు. కథలో డ్రామా కోసం కృత్రిమతను ఆశ్రయించకుండా, నిజ జీవితంలో కనిపించే పరిస్థితులను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తండ్రి ప్రేమ, ఆడపిల్ల జీవితం, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పరిస్థితులను హృదయానికి హత్తుకునేలా చూపించారు. సినిమా నిడివి కొంత తగ్గించి ఉంటే మరింత బాగుండేదనే భావన కలిగినా, భావోద్వేగాల విషయంలో దర్శకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నారు.

సాంకేతిక విభాగం

సంగీతం:

సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించిన ఆరు పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం భావోద్వేగ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది.

సినిమాటోగ్రఫీ:

గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు. ప్రతి ఫ్రేమ్ కథకు అనుగుణంగా సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

నిర్మాణ విలువలు:

కోమలి క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కథకు అవసరమైన చోట ఎక్కడా రాజీ పడినట్లు అనిపించదు.

నిర్మాత కోమలి గురించి:

ఈ చిత్ర నిర్మాత కోమలి మహేందర్ తొట్టె జానపద గాయనిగా మంచి గుర్తింపు పొందారు. అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో ఎదిగారు. తన భర్త ప్రోత్సాహంతో కళారంగంలో ముందుకు సాగిన కోమలి, గాయనిగా మాత్రమే కాకుండా ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. 'వెంకట్రామయ్య గారి తాలూకా' చిత్రాన్ని నిర్మించడం ద్వారా నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా తన నిజ జీవిత అనుభవాలకు దగ్గరగా ఉంటుందని ఆమె పలు సందర్భాల్లో భావోద్వేగంగా వెల్లడించారు. అందుకే సినిమాలో కనిపించే అనేక భావోద్వేగాలు ఎంతో సహజంగా అనిపిస్తాయి.

విశ్లేష‌ణ‌:

'వెంకట్రామయ్య గారి తాలూకా' గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మరో కుటుంబ కథ మాత్రమే కాదు. నేటి సమాజంలో కనుమరుగవుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టే చిత్రం. "తల్లిదండ్రులు పిల్లల కోసం జీవితాన్ని అర్పిస్తారు... కానీ వృద్ధాప్యంలో అదే పిల్లలకు వారు ఎందుకు భారమవుతున్నారు?" అనే ప్రశ్నను సినిమా చాలా హృద్యంగా ప్రేక్షకుల ముందుంచుతుంది.

కుటుంబ బాధ్యతలు, తండ్రి త్యాగం, ఆడపిల్ల జీవితంలోని భావోద్వేగాలు, మానవత్వం వంటి అంశాలను ఎక్కడా అతిశయోక్తి లేకుండా చెప్పడం ఈ చిత్ర ప్రత్యేకత. 'వెంకట్రామయ్య గారి తాలూకా' కమర్షియల్ హంగులతో ఆకట్టుకునే సినిమా కాదు. భావోద్వేగాలతో మనసును తాకే చిత్రం.

తల్లిదండ్రుల ప్రేమ విలువ ఏమిటో... కుటుంబ బంధాల బలం ఎంత గొప్పదో... మనిషి జీవితంలో డబ్బుకంటే మనుషులు ఎందుకు ముఖ్యమో గుర్తు చేసే చిత్రమిది. సినిమా ముగిసే సరికి చాలా మంది ప్రేక్షకుల కళ్లు చెమ‌ర్చుతాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని చూస్తే దాని భావోద్వేగం మరింత బలంగా అనిపిస్తుంది.

భారీ మాస్ ఎంటర్‌టైనర్ కోసం కాకుండా, మంచి కుటుంబ కథను ఆస్వాదించాలనుకునే ప్రతి ప్రేక్షకుడు తప్పకుండా చూడదగ్గ సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా'.

బాట‌మ్ లైన్: మనసును తాకే మధ్యతరగతి కుటుంబ కథ... తల్లిదండ్రుల త్యాగాలకు అద్దం పట్టిన భావోద్వేగ చిత్రం.

రేటింగ్: 3/5

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story