Venkatramaiah Gari Taluka: జూలై 17న 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. కవిత చేతుల మీదుగా ప్రీ రిలీజ్ వేడుక!
Venkatramaiah Gari Taluka: Venkatramaiah Gari Taluka: ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారి, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై సోమేష్ సారిపల్లితో సంయుక్తంగా నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'.
Venkatramaiah Gari Taluka: జూలై 17న 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. కవిత చేతుల మీదుగా ప్రీ రిలీజ్ వేడుక!
Venkatramaiah Gari Taluka: ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారి, కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై సోమేష్ సారిపల్లితో సంయుక్తంగా నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
చిన్న సినిమాలకు మా పార్టీ అండగా ఉంటుంది: కల్వకుంట్ల కవిత
ఈ వేడుకకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి, అంకితభావంతో ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రశంసించారు. చిన్న సినిమాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచించారు. తెలంగాణలో చిన్న సినిమాలకు తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తూ.. తెలుగు సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు దశరథ్ కూడా సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.
గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చాయి: మురళీధర్ గౌడ్
చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ, 'డీజే టిల్లు' తర్వాత తనకు అత్యంత తృప్తినిచ్చిన పాత్ర ఇదేనన్నారు. వెంకట్రామయ్య పాత్రలో నటిస్తున్నప్పుడు కథలోని లోతు వల్ల గ్లిజరిన్ అవసరం లేకుండానే కళ్ల వెంట నీళ్లు వచ్చాయని భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ, సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు ఎంపిక చేశానని, సీనియర్ నటి సుధతో పాటు ప్రతి నటుడు ప్రాణం పెట్టి నటించారని తెలిపారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అందించి ఆరు పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయన్నారు.
ఇది ఒక ఆడబిడ్డ కన్నీటి కథ: నిర్మాత కోమలి
నిర్మాత కోమలి మహేందర్ తొట్టె మాట్లాడుతూ, ఇది తన నిజ జీవిత అనుభవాల ఆధారంగా రూపొందించిన ఒక ఆడబిడ్డ కన్నీటి కథ అని తెలిపారు. సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న బంధాల మధ్య, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృదయానికి హత్తుకునేలా ఇందులో చూపించామన్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టకుండా రాలేరని ధీమా వ్యక్తం చేశారు. నటి జబర్దస్త్ సత్యశ్రీ కూడా స్టోరీ విన్న వెంటనే ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. హీరో దినేష్ కుమార్, హీరోయిన్ దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ జూలై 17న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.




