Vennelakanti: ఇలాంటి పాట వెన్నలకంటికే సాధ్యం...ఎందుకో తెలుసా?
తెలుగు సాహిత్య రంగంలో పాటల కుసుమాలు పూయించిన వారిలో వెన్నెలకంటి ఒకరు. కష్టమైన స్వరాలకు కూడా ఆయన అద్భుతమైన పాటలు అందించారు.
Vennelakanti: సాహిత్య ప్రపంచంలో అపూర్వమైన ప్రయోగాలతో శ్రోతల మనస్సులను దశాబ్దాలుగా దోచుకుంటున్న అరుదైన గీత రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. సాధారణ బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తదనంతరం చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఏకంగా 300 కి పైగా చిత్రాలలో 2,500 కు పైగా మధురమైన గీతాలను అందించారు.
ముక్తపదగ్రస్త శైలి ... సాహిత్య మాయాజాలం
1987లో దర్శకుడు వంశీ తెరకెక్కించిన మహర్షి చిత్రంలోని మాటరాని మౌనమిది.. అనే పాట క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ గీతాన్ని పూర్వ ప్రబంధాలలో ఉపయోగించే ముక్తపదగ్రస్తం అనే అరుదైన ప్రక్రియలో రాశారు. ఒక వాక్యం చివర వచ్చిన పదాన్నే తరువాతి వాక్యానికి మొదటి పదంగా మారుస్తూ పాటను నడిపించారు. మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది, గానమిదీ నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది, ప్రాణమైన మూగ గుండె రాగమిది...ఇళయరాజా అందించిన సంక్లిష్టమైన స్వరకల్పనకు కట్టుబడి, రాగభావం దెబ్బతినకుండా ఈ రకమైన క్లిష్టమైన సాహిత్యాన్ని కమనీయంగా సమకూర్చడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఇక మాటలకందని అమూర్తమైన ప్రేమభావాలను సులభమైన పదాలతో ఆవిష్కరించడంలో గురువులైన ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తిలను తానెప్పుడూ ఏకలవ్య శిష్యునిగా ఆరాధిస్తానని వెన్నెలకంటి వినమ్రంగా ప్రకటించారు.
అనువాద చిత్రాలకు ప్రాణం
కేవలం నేరుగా రాసిన పాటలే కాకుండా, దాదాపు 100 కి పైగా డబ్బింగ్ చిత్రాలకు సంభాషణలు, పాటలు రాసి విమర్శకుల ప్రశంసలు పొందారు. కమల్ హాసన్ నటించిన ప్రసిద్ధ తమిళ చిత్రాలకు తెలుగులో ప్రాణం పోసిన రచయితగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన అందించిన సాహిత్య సుగంధాలు ఎప్పటికీ తెలుగు శ్రోతల హృదయాలలో నిలిచే ఉంటాయి. కవిగా గుర్తింపు తెచ్చుకుంటే... భూమి ఉన్నంత వరకు గుర్తిండిపోతారు అన్నది అక్షరసత్యం. వెన్నెలకంటి భౌతికంగా లేకున్నా... ఆయన విరబూయించిన అక్షర కుసుమాలు ఇప్పటికీ గుభాళిస్తూనే ఉన్నాయి.




