Producer Suicide: నదిలోకి దూకి ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..!

Producer Suicide: కోలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్,యాక్టర్ కె. రాజన్ (86) చెన్నైలోని అడయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

Naresh.k
Updated on: 18 May 2026 9:04 AM IST
Producer Suicide
X

Producer Suicide: నదిలోకి దూకి ప్రముఖ నిర్మాత ఆత్మహత్య..!

K Rajan : తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో సీనియర్ ప్రొడ్యూసర్‌గా, దర్శకుడిగా, నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కె. రాజన్ ఇకలేరు. చెన్నైలోని అడయార్ నదిలోకి దూకి ఆయన ఆత్మహత్య చేసుకోవడం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా వేదికలపై చిన్న చిత్రాల నిర్మాతలకు అండగా నిలబడుతూ, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఒక సీనియర్ సినీ ప్రముఖుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తోంది.

పోలీసుల ప్రకారం.. మే 17 సాయంత్రం ఈ ఘోరం జరిగింది. నిర్మాత కె. రాజన్ తన కారులో ప్రయాణిస్తూ చెన్నైలోని అడయార్ వంతెన మీదుగా వెళ్తున్నారు. వంతెన మధ్యలోకి రాగానే హఠాత్తుగా కారును ఆపాల్సిందిగా ఆయన తన డ్రైవర్‌కు చెప్పారు. కారు ఆగడమే ఆలస్యం.. ఆయన కారు దిగి క్షణాల వ్యవధిలోనే వంతెన పైనుంచి కింద ఉన్న అడయార్ నదిలోకి దూకేశారు. దీన్ని చూసి షాకైన డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో గాలింపు చర్యలు చేపట్టి, కె. రాజన్ మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 86 ఏళ్ల వయసులో, అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న సీనియర్ నిర్మాత ఆత్మహత్య చేసుకోవడానికి గల బలమైన కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ లేదా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

కె. రాజన్ కేవలం నిర్మాత మాత్రమే కాదు.. కోలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.నిర్మాతగా 1983లో ‘బ్రహ్మచారిగల్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుదేవా హీరోగా వచ్చిన ‘డబుల్స్’, ‘ఆమె పావం’, ‘సోయంత దాట్ల’ వంటి పలు చిత్రాలను నిర్మించారు. దర్శకుడిగా ‘నమ్మ ఊరు మరియమ్మ’, ‘అంబిగైగల్’ వంటి సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించి మెప్పించారు. కేవలం తెర వెనుకే కాదు, తెరపై కూడా ‘కబడ్డీ కబడ్డీ’, ‘పాంబు సట్టై’, ‘అజితిన్ తడువు’, ‘పగసూరన్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి అలరించారు.

చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేస్తూ పరిశ్రమలోని చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు ఎల్లప్పుడూ తన మద్దతును అందించేవారు. సినిమా ఫంక్షన్లలో ఆయన మాట్లాడే ముక్కుసూటి మాటలు, ఇంటర్వ్యూలు ప్రేక్షకుల్లో ఆయనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. కె. రాజన్ మృతి పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర సెంటిమెంట్‌తో సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story