Pavala Shyamala Passes Away : టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
Pavala Shyamala Passes Away : ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.
Pavala Shyamala Passes Away
Pavala Shyamala Passes Away : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ఎన్నో సినిమాల్లో అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:52 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని మరియు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దయనీయ స్థితిలో ముగిసిన చివరి రోజులు
ఒకప్పుడు వెండితెరపై ఎంతోమందిని తన హాస్యంతో నవ్వించిన పావలా శ్యామల, చివరి రోజుల్లో అత్యంత దయనీయ పరిస్థితులను అనుభవించారు. ఆమె తీవ్రమైన హైబీపీ, కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆమెతో పాటు ఉన్న కుమార్తె మాధవి కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మూడు నెలల క్రితం వీరిద్దరినీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ఆవరణలో వదిలేసి వెళ్లడం గమనార్హం. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది, పోలీసుల సాయంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి, అక్కడి నుంచి అనాథాశ్రమానికి తరలించారు. ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం క్షీణించడంతో ఉస్మానియాలో ఇన్‌పేషంట్‌గా చేర్చినప్పటికీ చికిత్స ఫలించక ఆమె ప్రాణాలు విడిచారు.
ఛాలెంజ్ సినిమాతో తెరంగేట్రం.. 100కు పైగా చిత్రాలు
పావలా శ్యామల సినీ ప్రస్థానం 1984లో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ఛాలెంజ్ చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత తన మార్కు కామెడీ, విలక్షణ యాసతో సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 2019లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మత్తు వదలరాలో ఆమె చివరిగా వెండితెరపై కనిపించారు. 2014 నుంచి ఆమె తీవ్రమైన ఆర్థిక, వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ. 20 వేలు అందించడంతో పాటు నెలకు ఫించన్ అందేలా చర్యలు తీసుకుంది.
అండగా నిలిచిన టాలీవుడ్ ప్రముఖులు
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పావలా శ్యామల పరిస్థితి తెలుసుకుని సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు గతంలో ముందుకు వచ్చారు. జనసేనాని, సినీ నటుడు పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఆమెకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలిచారు. చివరి రోజుల్లో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక ప్రభుత్వ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడవాల్సి రావడం చూసి టాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.




