Vijay Antony: ఒకరోజు జనరల్‌ బోగీ.. మరోరోజు బజ్జీల బండి.. విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్‌ మామూలుగా లేవుగా!

Vijay Antony: తన కొత్త సినిమా ‘నాన్న కుట్టి’ ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ ఆంటోనీ, హీరోయిన్ ప్రీతి ఆస్రానీ హైదరాబాద్ అమీర్‌పేట వీధుల్లో సందడి చేశారు.

Arun Chilukuri
Published on: 24 Nov 2026 12:14 PM IST
Vijay Antony
X

Vijay Antony: ఒకరోజు జనరల్‌ బోగీ.. మరోరోజు బజ్జీల బండి.. విజయ్ ఆంటోనీ ప్రమోషన్స్‌ మామూలుగా లేవుగా!

Vijay Antony: సినిమా ప్రమోషన్లు అంటే సాధారణంగా స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు, భారీ ఈవెంట్లు గుర్తుకొస్తాయి. కానీ ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ మాత్రం ఎప్పుడూ విభిన్నమే. తన కొత్త సినిమా ‘నాన్న కుట్టి’ ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం హీరోయిన్ ప్రీతి ఆస్రానీతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని అమీర్‌పేట వీధుల్లో సందడి చేశారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా రోడ్లపై తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

స్వయంగా బజ్జీలు వేసి.. అభిమానులకు పంచిపెట్టిన హీరో

అమీర్‌పేట పరిసరాల్లో దాదాపు అరగంట పాటు స్థానికులతో ముచ్చటించిన విజయ్ ఆంటోనీ, ఓ చిరు వ్యాపారి బండి వద్ద ఆగి స్వయంగా మిర్చి బజ్జీలు వేశారు. వేడివేడి బజ్జీలను అక్కడున్న అభిమానులకు, స్థానికులకు తన చేతులతో పంచిపెట్టారు. స్టార్ హీరో తమ మధ్యకు వచ్చి ఇలా బజ్జీలు వేయడంతో జనం ఆశ్చర్యపోయి ఆయన్ను చుట్టుముట్టారు. అనంతరం ఏషియన్ సత్యం మాల్ సమీపంలోని ఓ ఇరానీ కేఫ్‌కు వెళ్లి, సాధారణ కస్టమర్ల మాదిరిగానే ఇరానీ చాయ్, బన్ మస్కాను ఆస్వాదించారు. అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడినా ఏమాత్రం అసహనం చెందకుండా అందరితో ఆప్యాయంగా ఫొటోలు దిగారు.

జనరల్ బోగీలో ప్రయాణం నుంచి బజ్జీల బండి దాకా..

‘నాన్న కుట్టి’ ప్రమోషన్ల కోసం విజయ్ ఆంటోనీ కొంతకాలంగా ఇలాంటి వినూత్న మార్గాలనే ఎంచుకుంటున్నారు. రెండు రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు సాధారణ రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించి వార్తల్లో నిలిచారు. ఖరీదైన హోటళ్ల కంటే నేరుగా సామాన్య ప్రేక్షకుల మధ్యకు వెళ్లడం ద్వారా తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.