Vijay Divorce Case: విజయ్ - సంగీత విడాకులు కీలక దశలోకి.. భరణంపై విభేదాలు

Vijay Divorce Case: తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Srinivas Rao
Published on: 20 April 2026 1:08 PM IST
Vijay Divorce Case
X

Vijay Divorce Case

Vijay Divorce Case: తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన, భార్య సంగీత విడాకుల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఆస్తుల పంపకం, భరణం విషయంలో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ వివాదం నేడు కోర్టు మెట్లు ఎక్కింది. అభిమానులను కలవరపెడుతున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.

కోర్టుకు చేరిన ఆస్తుల వివాదం

విజయ్, సంగీత దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవాలని భావించినప్పటికీ, భరణం విషయంలో పేచీ మొదలైంది. సోమవారం ఈ కేసు చెంగల్పట్టు ప్రధాన సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. ఆస్తుల పంపకాలపై గత శనివారం ఇరుపక్షాల న్యాయవాదులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై అందరి దృష్టి నెలకొంది. తమ 25 ఏళ్ల వైవాహిక బంధం ఇలా కోర్టు గడప తొొక్కడం తమిళనాట సంచలనంగా మారింది.

భారీ భరణం డిమాండ్?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సంగీత తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 250 కోట్ల భారీ మొత్తాన్ని భరణంగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా ఆమె ఈ డిమాండ్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం రూ. 35 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పిల్లల బాధ్యతలను పూర్తిగా తానే చూసుకుంటానని కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఈ భారీ వ్యత్యాసం కారణంగానే చర్చలు కొలిక్కి రావడం లేదు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ

ప్రస్తుతం రాజకీయ యాత్రలు, ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న విజయ్, కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం కష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 17నే విన్నవించారు. మరోవైపు, విడాకుల ప్రక్రియ ముగిసే వరకు తాము నివసిస్తున్న నీలాంగరై గృహంలోనే ఉండేందుకు అనుమతించాలని సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు నిర్ణయం తీసుకోనుంది.

రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన ముద్ర వేయాలని చూస్తున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి కుదుపులు రావడం ఆయన అనుచరులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ పనుల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవాల్సిన సవాలు ఆయన ముందు ఉంది. కోర్టు విచారణ అనంతరం ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story