Vinodam: అప్పట్లో వందరోజులు ఆడిన వినోదం సినిమా...ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన వినోదం సినిమా అప్పట్లో 100 రోజులు ఆడింది. సినిమాలో కామెడి పరంగా బాగున్నా... ఇప్పుడు చూస్తే మాత్రం కథను దాటి లాజిక్‌లేని సినిమా ఎలా ఆడిందా అనిపిస్తుంది.

Balachander
Published on: 11 July 2026 4:42 PM IST
Vinodam: అప్పట్లో వందరోజులు ఆడిన వినోదం సినిమా...ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుంది
X

Vinodam:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో ఫ్యామిలీ సినిమాలకు, క్లీన్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్.వి. కృష్ణా రెడ్డి. ఆయన హయాంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అలాంటి వాటిలో 1996 లో విడుదలైన ‘వినోదం’ సినిమా ఒకటి. అప్పట్లో ఏకంగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించిన ఈ సినిమాను, నేటి డిజిటల్ యుగంలో ఓటీటీ వేదికలపై చూస్తే మాత్రం ఒక రకమైన విచిత్రమైన భావన కలుగుతుంది. నేటి ‘F3’ వంటి లాజిక్ లేని జిబ్రిష్ కామెడీ సినిమాలకు ఈ చిత్రమే మూలమని చెప్పవచ్చు. మిలీనియం కిడ్స్ కోసం ఈ సినిమా అసలు కథ, అందులోని లాజిక్ లేని వెటకారాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

గంటలో బ్యాంక్... మరో గంటలో పోలీస్ స్టేషన్

కథ చాలా పాతదే... హీరోయిన్ శ్రీమంతరాలు, హీరో చాలా పేదవాడు. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. హీరోయిన్ తండ్రి అయిన కోట శ్రీనివాసరావును నమ్మించి, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని హీరో ప్లాన్ వేస్తాడు. ఇక్కడి వరకు బాగున్నా, ఆ తర్వాత వచ్చే ట్విస్టులే ఇప్పుడు చూస్తే తలపట్టుకునేలా చేస్తాయి. హీరో, అతని స్నేహితులు కలిసి కేవలం గంటలో ఒక నకిలీ బ్యాంకును నిర్మిస్తారు. వారే అందులో ఉద్యోగులుగా నటిస్తారు. నిజమైన బ్యాంకు అని నమ్మి కోట ఏకంగా కోటి రూపాయలు అందులో డిపాజిట్ చేస్తాడు.

ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు... ఆ బ్యాంక్ ఫ్రాడ్ అని తెలిసి కోట పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటే, హీరో గ్యాంగ్ మరో గంటలో ఒక నకిలీ పోలీస్ స్టేషన్ కట్టేసి, తామే పోలీసులుగా అవతారమెత్తుతారు. కోట దీన్ని కూడా నమ్మేస్తాడు. ఆఖరికి నిజం తెలిసి హీరోను తరిమికొడితే, మళ్లీ విదేశీయుడి వేషంలో వచ్చిన హీరోను కోట గుర్తుపట్టకపోవడం నేటి తరం ప్రేక్షకుడికి కాస్త అతిగా అనిపిస్తుంది.

తనికెళ్ల భరణి మాయం ఎపిసోడ్....టూ మచ్ కామెడీ

సినిమాలో తనికెళ్ల భరణి కామెడీ ట్రాక్ అయితే మరీ విడ్డూరంగా ఉంటుంది. ఒంటికి ఒక రకమైన తైలం రాసుకుంటే మనిషి మాయమైపోతాడని నమ్మి, బట్టలన్నీ విప్పేసి నడిరోడ్డుపైకి వచ్చి ఆయన చేసే డాన్స్ అప్పట్లో నవ్వించినా, ఇప్పుడు చూస్తే మాత్రం ఇంత వెటకారాన్ని అప్పట్లో ఎలా చూశాం అబ్బా అనిపిస్తుంది.

సినిమాను నిలబెట్టిన కోట, బ్రహ్మీల నటన

ఈ సినిమాలో లాజిక్కులు పక్కన పెడితే, సినిమాను వంద రోజులు ఆడించింది మాత్రం నటీనటుల ప్రతిభే. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు అద్భుత నటన, ఆయనపై వచ్చే కార్మిక నాయకుడు సింగారానికి జిందాబాద్ అనే ఎపిసోడ్ ఇప్పటికీ నవ్విస్తుంది. దీనికి తోడు బ్రహ్మానందం కామెడీ బిట్స్, ఎస్.వి. కృష్ణా రెడ్డి మార్కు సూపర్‌హిట్ పాటలు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. వెటకారం ఉండొచ్చు కానీ, అది కథను దాటి మరీ ఎక్కువ మోతాదులో ఉండకూడదని నేటి తరం స్క్రీన్ ప్లే నిపుణులు చెబుతుంటారు. ఎప్పుడూ పద్ధతిగా కుటుంబ కథా చిత్రాలు తీసే ఎస్.వి. కృష్ణా రెడ్డి ఈ సినిమాలో మాత్రం లాజిక్‌ను పూర్తిగా పక్కనబెట్టేసి కేవలం నవ్వులనే నమ్ముకున్నారు. కాలం మారినా, కోట..బ్రహ్మానందంల నటన కోసం ఈ సినిమాను ఇప్పటికీ ఒకసారి సరదాగా చూడవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story