Badri movie: పవన్‌ కళ్యాణ్‌ బద్రీ సినిమాను నాగ్‌ చేసుంటే...

Badri movie: ఈరోజు మనం 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' సినిమాల్లో చూస్తున్న హీరోల యాటిట్యూడ్, పొగరును పాతిక ఏళ్ల క్రితమే వెండితెరపై ఆవిష్కరించిన సినిమా 'బద్రి'.

Balachander
Updated on: 21 April 2026 1:04 PM IST
Badri movie
X

Badri movie

Badri movie: ఈరోజు మనం 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' సినిమాల్లో చూస్తున్న హీరోల యాటిట్యూడ్, పొగరును పాతిక ఏళ్ల క్రితమే వెండితెరపై ఆవిష్కరించిన సినిమా 'బద్రి'. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం పూరీ జగన్నాథ్ అనే ఒక సెన్సేషనల్ డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కథకు మొదటి ఛాయిస్ పవన్ కాదనే విషయం చాలామందికి తెలియదు.

కింగ్ నాగార్జున కోసం పుట్టిన కథ

పూరీ జగన్నాథ్ దర్శకుడు కావాలనే కసితో రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేస్తున్న రోజుల్లోనే 'బద్రి' కథను సిద్ధం చేసుకున్నారు. ఈ కథలోని కొత్తదనం, హీరో క్యారెక్టరైజేషన్ కింగ్ నాగార్జునకు సరిగ్గా సరిపోతాయని పూరీ భావించారు. నాగ్ కూడా కథ విన్నారు కానీ, అప్పట్లో ఉన్న కొన్ని సాంకేతిక కారణాలు, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఒకవేళ నాగ్ ఈ సినిమా చేసి ఉంటే, 'శివ' తర్వాత ఆయన కెరీర్‌లో మరో డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న సినిమాగా ఇది నిలిచిపోయేది. ఈరోజు కింగ్‌ నాగార్జునను బద్రీ నాగ్‌ అని కూడా పిలిచేవాళ్లమేమో. కానీ, బద్రీలో పవన్‌కళ్యాణ్‌ యాటిట్యూడ్‌, ఆ స్వాగ్‌ చూసిన తరువాత బద్రీ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. పూరీ టేకింగ్‌ స్టైల్‌ వేరే అని చెప్పాలి.

పవన్ కళ్యాణ్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి?

నాగార్జున దగ్గర నుంచి ఈ కథ పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. కథ విన్న పవన్ ఇంప్రెస్ అయ్యారు కానీ, క్లైమాక్స్ విషయంలో ఆయనకు కొన్ని సందేహాలు కలిగాయి. "క్లైమాక్స్ మార్చితేనే సినిమా చేస్తాను" అని పవన్ కండిషన్ పెట్టారట. కానీ, మొదటి సినిమా చేస్తున్నా సరే.. తన కథపై ఉన్న నమ్మకంతో పూరీ "నో" అని చెప్పారు. "కథకు ఇదే క్లైమాక్స్ కరెక్ట్, మార్చే ప్రసక్తే లేదు" అన్న పూరీ కాన్ఫిడెన్స్ పవన్‌కు బాగా నచ్చేసింది. వెంటనే క్లైమాక్స్ మార్చకుండానే షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలు పవన్‌ కళ్యాణ్‌ మెడ వెనుక చేయివేసి రఫ్‌చేసే సీన్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఆ సీన్‌ యూత్‌ ఐకాన్‌గా మారిపోయింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఒకవేళ ఈ సినిమాను నాగార్జున చేసి ఉంటే... ఆయన స్టైలే వేరుగా ఉండేది. కానీ, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఈ కథకు ఒక కొత్త 'ఎనర్జీ'ని ఇచ్చింది. దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ప్రయాణం మొదలై 26 ఏళ్లు పూర్తయినా, నేటికీ 'బద్రి' మేనరిజమ్స్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ పాత్రను ఎంత బలంగా డిజైన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. పవన్ నమ్మకం, పూరీ మొండితనం వెరసి తెలుగు సినిమాకు ఒక ట్రెండ్ సెట్టర్ లభించింది. ప్రతి గింజపై తినేవాడి పేరు రాసిపెట్టి ఉంటుంది అనే సామెత సినిమా విషయంలోనూ కరెక్ట్‌గా సరిపోతుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story