Arjun: సీఎం సీటు చూసి విజయ్‌కు గుర్తొచ్చింది ఇదే.. అర్జున్ చెప్పిన ఆసక్తికర విషయం!

Arjun: అర్జున్.. ఇటీవల తాను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలిసినప్పటి ముచ్చట్లను, అలాగే రాజకీయాలు మరియు తన సినిమా విశేషాలను పంచుకున్నారు.

Srinivas Rao
Published on: 25 May 2026 6:04 PM IST
Arjun
X

Arjun: సీఎం సీటు చూసి విజయ్‌కు గుర్తొచ్చింది ఇదే.. అర్జున్ చెప్పిన ఆసక్తికర విషయం!

Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘బ్లాస్ట్: జోన్. మే ఇరవై ఎనిమిది నాడు థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం ఘనంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అర్జున్.. ఇటీవల తాను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలిసినప్పటి ముచ్చట్లను, అలాగే రాజకీయాలు మరియు తన సినిమా విశేషాలను పంచుకున్నారు.

విజయ్‌కి ‘ఒకే ఒక్కడు’ గుర్తొచ్చిందట!

సినిమా రంగానికి చెందిన విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఒక నటుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందని అర్జున్ పేర్కొన్నారు. “ఇటీవల నేను సీఎం విజయ్‌ని కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన తన ముఖ్యమంత్రి కుర్చీని చూపిస్తూ.. ‘ఈ సీటును చూసిన ప్రతిసారీ నాకు మీ ఒకే ఒక్కడు సినిమానే గుర్తొస్తోంది అర్జున్ సర్’ అని నవ్వుతూ చెప్పారు. అంతేకాదు, అదే సినిమాని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న క్రేజీ మీమ్స్ గురించి కూడా విజయ్ నాతో మాట్లాడారు” అని అర్జున్ వెల్లడించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ..

టాలీవుడ్ నుంచి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, కోలీవుడ్ నుంచి విజయ్ తమిళనాడు సీఎంగా రాణిస్తున్నారు కదా.. మరి మీరేమైనా పాలిటిక్స్ లోకి వస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా అర్జున్ తనదైన శైలిలో స్పందించారు. “నేను ప్రశాంతంగా, బాగుండటం మీకు ఇష్టం లేదనుకుంటా (నవ్వుతూ..). నాకు సమాజ సేవ చేయడం ఇష్టమే, కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన, ఆసక్తి అస్సలు లేవు” అని స్పష్టం చేశారు.

గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఎందుకు చేయలేదంటే?

ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటించే అవకాశం మొదట మీకే వచ్చిందట కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. “అవును, ఆ కథతో నన్ను సంప్రదించారు. నేను కూడా ఆయన సిద్ధాంతాలు, నేపథ్యంపై చాలా హోమ్‌వర్క్ చేసి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ఆ తర్వాత మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. (ప్రస్తుతం ఈ బయోపిక్ లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారు)” అని చెప్పారు.

కొత్త దర్శకుడితో ‘బ్లాస్ట్: జోన్’ జర్నీ

పెద్ద పెద్ద దర్శకులతో పనిచేసిన మీరు.. కొత్త దర్శకుడు సుభాష్ కె. రాజ్ తో సినిమా చేయడంపై స్పందిస్తూ.. “ఇవాళ పెద్ద డైరెక్టర్లయిన వారంతా ఒకప్పుడు కొత్తవారే కదా. శంకర్ కూడా నాతో ‘జెంటిల్‌మేన్’ చేసినప్పుడు కొత్త దర్శకుడే. కొత్తవారిలో ఒక రకమైన కసి, ఫైర్ ఉంటాయి. అందుకే నేను కొత్త ప్రతిభను ఎప్పుడూ గౌరవిస్తాను” అని అర్జున్ ప్రశంసించారు.

మే 28న ‘బ్లాస్ట్: జోన్’ విడుదల

అనుకోని ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక హెడ్‌మాస్టర్ కుటుంబం.. తమను తాము కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటం చేసిందనే ఆసక్తికరమైన కథాంశంతో ‘బ్లాస్ట్: జోన్’ చిత్రం రూపొందింది. అభిరామి, ప్రీతీ ముకుందన్ కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 28, 2026 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story