Krishna Kumari Saree Story: కృష్ణకుమారికి చీర కట్టుకోవడం ఎవరు నేర్పించారో తెలుసా?
సీనియర్ నటి కృష్ణకుమారి తన కెరీర్ ఆరంభంలో చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు ఆమెకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించి గురువుగా నిలిచారు.
Krishna Kumari Saree Story: సీనియర్ నటి కృష్ణకుమారి తన కెరీర్ ఆరంభంలో చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు ఆమెకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించి గురువుగా నిలిచారు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. అక్కినేని తన కెరీర్ ప్రారంభంలో నాటకాలు వేసే రోజుల్లో ఆడవారి వేషం వేసేవారని, ఆ సమయంలోనే చీర కట్టుకోవడం నేర్చుకున్నారని, అలా నేర్చుకున్నది వృధా పోకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత హీరోయిన్లకు ఎలా కట్టుకోవాలో నేర్పించారని సినీ పండితులు చెబుతున్నారు. నేర్చుకున్న విద్యా, నైపుణ్యం ఎప్పటికైనా అక్కరకు వస్తాయని చెప్పడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.
అక్కినేని శిక్షణలో చీరకట్టు
వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే కృష్ణకుమారికి ఆరంభంలో చీర కట్టడం ఒక పెద్ద సవాలుగా ఉండేదట. ఒక సందర్భంలో అన్నపూర్ణమ్మ అక్కినేనితో.. "మీరు సినిమాల్లో ఆడవేషాలు కూడా వేశారు కదా, కృష్ణకుమారికి చీరకట్టు నేర్పించవచ్చు కదా" అని అన్నారట. ఆ మాటను సీరియస్‌గా తీసుకున్న ఏఎన్నార్ గారు, సెట్‌లో కృష్ణకుమారికి చీర ఎలా కట్టాలి, మడతలు ఎలా పెట్టాలో స్వయంగా నేర్పించారు. ఆ శిక్షణ వల్లే తదనంతర కాలంలో ఆమె చీరకట్టులో ఎంతో అందంగా, పద్ధతిగా కనిపించగలిగారు.
హిందీ అవకాశాలను కాదన్న 'విమాన భయం'
కృష్ణకుమారి గారు తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు. అయితే, హిందీలో ఒక సినిమా చేశాక వరుసగా నాలుగు పెద్ద ఆఫర్లు వచ్చాయి. కానీ, అప్పట్లో ఆమెకు విమాన ప్రయాణం అంటే విపరీతమైన భయం. ఆ భయం కారణంగానే ముంబై వెళ్లలేక బాలీవుడ్ కెరీర్‌ను వదులుకుని, తన మాతృభాష అయిన తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు. కానీ, ఈరోజుల్లో హీరోయిన్లు ఈరోజు హైదరాబాద్‌లో షెడ్యూల్ చేస్తే రేపు ముంబై షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడి నుంచి హటాత్తుగా విదేశాలకు వెళ్లి అక్కడ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎంత తక్కువ సమయంలో ఎన్ని సినిమాల్లో నటిస్తే అంత మంచి సంపాదన అన్నది ఈనాటి తారల మనోగతం.
110 చిత్రాల కథానాయిక - మధుర గీతాలు
కృష్ణకుమారి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమారు 110 సినిమాల్లో కథానాయికగా నటించారు. ఆనాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో కలిసి నటించడం అంటే ఆమెకు చాలా ఇష్టం. వీరితో కలిసి నటించిన చిత్రాల్లో పెద్ద విజయం సాధించాయి. ఇక ఆమె కెరీల్లో బెస్ట్ సాంగ్స్‌గా ఊహలు గుసగుసలాడే, నా కంటిపాపలో నిలిచిపోరా, తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసం అనే పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. నేటికీ ఈ పాటలు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.
కృష్ణకుమారి తన నటనకు స్వస్తి చెప్పినపుడు అభిమానుల నుంచి వేలాది ఉత్తరాలు వచ్చాయట. నటించడం ఆపవద్దని వేడుకున్నారట. ఆ ఉత్తరాలను చదివి కృష్ణకుమారి కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆనాటి పాటల్లో కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా ముఖ కవళికలు, సిగ్గు వంటి హావభావాలకు కూడా ప్రాధాన్యత ఉండేదని కృష్ణకుమారి చెప్పడం విశేషం. వెండితెరపై వెలుగులీనిన ఈ బంగారుపాప జ్ఞాపకాలు ఎప్పటికీ అజరామరమే. సినీరంగం ఉన్నంతకాలం కృష్ణకుమారిని గుర్తుపెట్టుకుంటారు.




