Telugu Cinema: నటులుగా హిట్టయ్యినవారు...నిర్మాతలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?
నటులుగా విజయవంతమైన చాలామంది నిర్మాతలుగా ఎందుకు నష్టపోతున్నారు? బడ్జెట్ నియంత్రణ, రిస్క్, క్రమశిక్షణపై మురళీమోహన్ చెప్పిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
Telugu Cinema: సినిమాలో హీరోగా ఓ వెలుగు వెలిగితే నిర్మాతగా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తారనే గ్యారెంటీ లేదు. తెరపై ప్రేక్షకులను మెప్పించడం ఒక కళ అయితే.. సినిమా నిర్మాణంలో డబ్బును కాపాడుకుంటూ కథను గమ్యానికి చేర్చడం మరో పెద్ద సవాలు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే చాలామంది నటుల నిర్మాతలుగా మారిన తర్వాత ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులకు కారణమైందని సీనియర్ నటుడు మురళీ మోహన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ వంటి అగ్రనటుల కాలం నుంచి ఇప్పటి తరం వరకు సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఒక విషయం మాత్రం పెద్దగా మారలేదని మురళీ మోహన్ అభిప్రాయం. అదే.. సినిమా విజయం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కానీ ఎంత డబ్బు పెట్టాలి, ఎంత వరకు రిస్క్ చేయాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
నటుడి సంపాదన.. నిర్మాతకు పెట్టుబడి
తన కెరీర్‌లో ఎన్నో విజయాలు చూసిన మురళీ మోహన్.. వైఫల్యాలను దూరంగా ఉంచడంలో క్రమశిక్షణ, పట్టుదల, ముందస్తు ఆలోచన కీలకమని చెప్పారు. ముఖ్యంగా నిర్మాతగా ఉన్నప్పుడు భావోద్వేగాలకు బదులు లెక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అనుభవం చెబుతోంది. తన కళ్లముందే ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు ఆర్థికంగా ఇబ్బందులు పడటం చూశానని మురళీ మోహన్ గుర్తుచేశారు. హరనాథ్ రాజు, రాజబాబు, చలం, పద్మనాభం వంటి నటులు సొంతంగా సినిమాలు నిర్మించేందుకు వెళ్లి నష్టాలను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కత్తి కాంతారావు ఉదాహరణను కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పారు. హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన.. నిర్మాతగా మారిన తర్వాత ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న కాంతారావుకు రజనీకాంత్ వంటి వారు సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మురళీ మోహన్ పేర్కొన్నారు.
మురళీమోహన్ విజయానికి అసలు కారణం ఇదే
తన నిర్మాణ సంస్థ విషయంలో మాత్రం బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని మురళీ మోహన్ చెప్పారు. ఇందులో తన సోదరుడు కిషోర్‌ది కీలక పాత్ర అని వెల్లడించారు. ఆడిటింగ్‌లో మంచి పరిజ్ఞానం ఉన్న కిషోర్.. సినిమా నిర్మాణంలో ఖర్చులను కచ్చితంగా పర్యవేక్షించేవారని తెలిపారు. ఒక సినిమా కోసం నిర్ణయించిన బడ్జెట్‌ను ముందుగానే ఖరారు చేసుకుని, దానిని 5 శాతం కూడా దాటకుండా చూసుకునేవారట. షూటింగ్ మధ్యలో అనుకోని ఖర్చులు వచ్చినా, వాటిని నియంత్రించడం ఎలా అన్నదానిపై కిషోర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారని మురళీ మోహన్ వివరించారు. ఇండస్ట్రీలో కొందరు కిషోర్‌ను కఠినంగా వ్యవహరిస్తారని విమర్శించినా.. అదే కఠినత్వం తమ నిర్మాణ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడిందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. నిర్మాతకు నచ్చినట్టుగా కాకుండా.. లెక్కకు తగ్గట్టుగా ఖర్చు చేయడమే ఆయన పద్ధతి.
సావిత్రి ముందు తొలి షాట్.. మురళీమోహన్‌కు మరపురాని అనుభవం
ఇదే సందర్భంగా మహానటి సావిత్రితో తనకున్న అనుబంధాన్ని కూడా మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు. ఆమెతో కలిసి ‘భారతంలో ఒక అమ్మాయి’ వంటి చిత్రాల్లో నటించినట్లు చెప్పారు. సావిత్రితో కలిసి తొలిసారి షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన డైలాగ్ పూర్తయిన తర్వాత సావిత్రి ఇచ్చిన హావభావాలను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆ ఒక్క సన్నివేశంతోనే ఆమె నటనలోని స్థాయి తనకు అర్థమైందని, ఆ గౌరవంతో ఆమె కాళ్లకు నమస్కరించానని మురళీ మోహన్ గుర్తుచేసుకున్నారు.
సినిమా రంగంలో ప్రతిభ ఒక్కటే విజయానికి సరిపోదని మురళీ మోహన్ చెప్పిన మాటల్లో అసలు విషయం దాగి ఉంది. నటుడిగా ప్రేక్షకుల మెప్పు పొందడం ఒక విజయం అయితే.. నిర్మాతగా ఆ విజయాన్ని లాభంగా మార్చుకోవడానికి లెక్కలు, క్రమశిక్షణ, రిస్క్‌పై నియంత్రణ కూడా అంతే అవసరం. ఈ తేడాను అర్థం చేసుకోలేకపోవడమే ఎంతోమంది విజయవంతమైన నటులను నిర్మాతలుగా నష్టాల బాట పట్టించిందన్నది ఆయన అనుభవ సారం.




