Clapboard: షూటింగ్‌లో క్లాప్‌ ఎందుకు కొడతారో తెలుసా? నూటికి 90శాతం మందికి తెలియని రహస్యం

సినిమా షూటింగ్‌లో క్లాప్ ఎందుకు కొడతారు? ఆడియో-వీడియో సింక్ నుంచి ఎడిటింగ్ వరకు క్లాప్ బోర్డు చేసే కీలక పనులు ఏమిటో తెలుసుకోండి. చాలామందికి తెలియని సినిమా టెక్నికల్ రహస్యం.

Balachander
Published on: 4 Jun 2026 2:12 PM IST
Clapboard: షూటింగ్‌లో క్లాప్‌ ఎందుకు కొడతారో తెలుసా? నూటికి 90శాతం మందికి తెలియని రహస్యం
X

Clapboard: సినిమా షూటింగ్‌ మొదలౌతుంది అంటే ముందుగా మనం చూసేది క్లాప్‌ బోర్డ్‌. ముహూర్తం షాట్స్‌లో పబ్లిసిటీ కోసం ఇండస్ట్రీలో టాప్‌ సెలబ్రిటీ వచ్చి క్లాప్‌ కొడతాడు. మరో సెలబ్రిటీతో యాక్షన్‌ చెప్పించడం మనం చూస్తూనే ఉంటాం. క్లాప్‌ కొట్టే సీన్‌ కేవలం ముహూర్తం సమయంలోనే అనుకుంటే పొరపాటే. షూటింగ్‌ జరిగే ప్రతిరోజూ...ప్రతీ షాట్‌కు ముందు క్లాప్‌ కొడుతూనే ఉంటారు. పైన ఒక చెక్క ముక్క, దానికింద ఒక చెక్కబోర్డ్‌ కలిపి ఉంటుంది. పైన చెక్కముక్కను కాస్త పైకి తెరిచి కింద ఉన్న చెక్కపై కొడతారు. అప్పుడు టపాక్‌ అనే శబ్దం వస్తుంది. సినిమా ప్రారంభమైందని చెప్పడం దీని ఉద్దేశం కాదు. అంతకు మించిన రహస్యాలు ఉన్నాయి. నూటికి 90 శాతం మందికి తెలియని బలమైన సాంకేతిక కారణాలు ఉన్నాయి. సినిమా మేకింగ్‌లో ఈ క్లాప్‌బోర్డ్‌ ఎంతో కీలకం. వాటి రహస్యాలేంటో తెలుసుకుందాం.

ఆడియో ...వీడియోను ఒకేతాటికి తెచ్చే మాయాజాలం

సినిమా షూటింగ్‌ సమయంలో కెమెరా కేవలం విజువల్స్‌ని మాత్రమే రికార్డ్‌ చేస్తుంది. డైలాగులు, ఇతర శబ్దాలను అత్యాధునిక సౌండ్‌ రికార్డర్లు రికార్డ్‌ చేస్తుంటాయి. వీడియో ఒక పరికరంలో, ఆడియో మరో చోట రికార్డవుతాయి. ఎడిటింగ్‌ చేసే సమయంలో ఆడియో, వీడియో రెండింటిని మిక్స్‌ చేయాలి. మిక్సింగ్‌లో నటుల లిప్‌ సింక్‌కి ఆడియో కరెక్ట్‌గా మ్యాచ్‌ కావాలి. ఇది పెద్ద టాస్క్‌. దీనికి పరిష్కారమే క్లాప్‌బోర్డ్‌. షాట్‌ తీసేముందు క్లాప్‌బోర్డ్‌ను గట్టిగా కొడతారు. అలా కొట్టగానే వచ్చే శబ్దం ఆడియోలో పెద్దవేవ్‌లా రికార్డ్‌ అవుతుంది. క్లాప్‌బోర్డ్‌ పైభాగం కింది భాగాన్ని తాకిన క్షణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ రూమ్‌లో ఎడిటర్‌ క్లాప్‌వేవ్‌ను, క్లాప్‌ విజువల్స్‌ని పక్కాగా మ్యాచ్‌ చేయగానే ఆడియో వీడియో సింక్‌ అవుతాయి. దీని కోసమే క్లాప్‌బోర్డ్‌ను వినియోగిస్తారు.

ఎడిటర్‌కు దిక్సూచి.. సమయం ఆదా!

ఒక సినిమాలో వందల సీన్లు ఉంటాయి. ప్రతి సీన్‌లోనూ ఎన్నో షాట్లు, ప్రతి షాట్‌కు 4 నుండి 5 టేక్‌లు లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటారు. ఏది బెస్ట్‌ షాట్‌, ఏది చెత్త షాట్‌ అన్నది గుర్తుపట్టడానికి క్లాప్‌ బోర్డ్‌ దానిమీద రాసిన వివరాలు పనికొస్తాయి. క్లాప్‌ బోర్డ్‌మీద సీన్‌ నంబర్‌, షాట్‌ నంబర్‌, టేక్‌ నంబర్‌, డైరెక్టర్‌, కెమెరామెన్‌ పేర్లు రాస్తారు. ఇక ఇప్పుడు జరుగుతున్న షూటింగ్స్‌లో డిజిటల్‌గా రన్నింగ్‌ టైమ్‌ సెకన్లతో సహా చూపిస్తుంది. ఈ వివరాలన్నింటినీ చూపిస్తుంది కాబట్టే ఎడిటింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతంది. ఈ క్లాప్‌బోర్డ్‌ లేకుంటే ఎడిటింగ్‌కు సినిమాను ఎడిట్‌ చేయడం నరక ప్రాయంగా మారుతుంది. వేల సంఖ్యలో ఉండే క్లిప్లింగులను చూసుకోవాలంటే సాధ్యం కాదు. సినిమా రంగం ఎంత డిజిటల్ వైపు అడుగులు వేసినా, శతాబ్దాల నాటి ఈ క్లాప్ బోర్డ్ సాంప్రదాయం నేటికీ అప్రాధాన్యంగా మారకపోవడానికి కారణం ఇదే!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story