Legendary Actress Savitri: ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను ధీటుగా ఎదుర్కొన్న సావిత్రి...రియల్‌ లైఫ్‌లో ఎందుకిలా మారింది?

వెండితెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో సమానమైన ఇమేజ్ సొంతం చేసుకుని, వారిని ఢీకొట్టిన ఏకైక నటి సావిత్రి.

Balachander
Published on: 18 May 2026 2:08 PM IST
Legendary Actress Savitri:  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లను ధీటుగా ఎదుర్కొన్న సావిత్రి...రియల్‌ లైఫ్‌లో ఎందుకిలా మారింది?
X

Legendary Actress Savitri: వెండితెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలతో సమానమైన ఇమేజ్ సొంతం చేసుకుని, వారిని ఢీకొట్టిన ఏకైక నటి సావిత్రి. కానీ, అంతటి మహానటి తన వ్యక్తిగత జీవితంలో మానసిక స్థైర్యం కోల్పోయి, మద్యపానానికి బానిసగా మారి తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నారని సీనియర్ నటి జమున ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఎంతో మంది నటీమణులు వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని నిలబడినప్పటికీ, సావిత్రి మాత్రం జెమిని గణేషన్ ప్రవర్తన వల్ల తీవ్ర మనస్తాపానికి గురై పతనమయ్యారని జమున గుర్తు చేసుకున్నారు.

జెమిని గణేషన్‌తో మొదలైన మనస్పర్థలు

మొదట్లో జమున, సావిత్రిల మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధాలే ఉండేవి. కానీ, సావిత్రికి వివాహమై జెమిని గణేషన్‌తో గొడవలు తీవ్రరూపం దాల్చిన సమయంలో, జమునకు కుమారుడు జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటివరకు తన మనసులోని బాధలను ఎవరికీ చెప్పుకోని సావిత్రి, మొదటిసారి జమున వద్ద తన కన్నీటి గాథను పంచుకోవడం ప్రారంభించారు. జెమిని గణేషన్ వేరే మహిళలతో తిరుగుతున్నాడనే తీవ్రమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సావిత్రిని లోపల కుంగదీసిందని జమున తెలిపారు.

రూమ్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన మహానటి

ఒకనాటి చేదు జ్ఞాపకాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఒకరోజు సావిత్రి మద్యం సేవించి జమున ఇంటికి వచ్చారు. సావిత్రి రాకను గుర్తించిన జమున ఆమెను తీసుకొని గదిలోకి వెళ్లారు. అలా గదిలోకి వెళ్లగానే జెమిని గణేషన్‌ చేసిన మోసాలను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చింది. మంచి భర్త, బంగారం లాంటి కొడుకు ఉన్నారని, ఈ విషయంలో జమున అదృష్టవంతురాలని సావిత్రి చెప్పినట్టుగా జమున గుర్తుచేసుకున్నారు. జెమిని గణేషన్‌ తనను రోడ్డుపై పడేశారని భోరున విలపించినట్టు తెలిపారు. ఇండస్ట్రీలో అందరూ ఆయన్ను చేసుకోవద్దని చెప్పినా వినకుండా ముందుకు అడుగు వేశావని, ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా గతం గతః అన్నావని, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు...వారికోసం మద్యం మాని బలంగా బతకాలని సావిత్రిని కోరినట్టు జమున తెలిపారు.

సమకాలీనులు నిలబడ్డారు.. సావిత్రి మాత్రమే ఎందుకు?

సావిత్రి లాంటి జీవితం ఎదురైనా ఇండస్ట్రీలో కృష్ణకుమారి, దేవిక, షావుకారు జానకి, అంజలీదేవి వంటి సమకాలీన నటీమణులు ఎదుర్కొని నిలబడ్డారు. సావిత్రి కూడా అలానే ధైర్యంగా ఉండాలని జమున పలుమార్లు చెప్పినట్టుగా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, ఆమె మానసిక స్థైర్యం రోజు రోజుకు దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్రహీరోలు ఒకనొక సమయంలో సావిత్రిని బాయ్‌కాట్‌ చేసినపుడు గుండెనిబ్బరంతో నిలబడిన సావిత్రి... భర్త విషయంలో మానసిక బలహీనత కారణంగా మద్యానికి బలికావడం సినీచరిత్రలోనే ఓ పెద్ద విషాదంగా మిగిలిపోయింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story