Sherlock Holmes: డిటెక్టీవ్‌ పాత్ర షెర్లాక్‌ హోమ్స్‌ పాపులర్‌ కావడానికి కారణమేంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిన పాత్రల్లో షెర్లాక్ హోమ్స్‌ కూడా ఒకటి. డిటెక్టీవ్‌ పాత్రలకు మార్గదర్శకత్వం వహించిన ఈ పాత్ర నాటికీ నేటికి అద్భుతం అనే చెప్పాలి.

Balachander
Published on: 6 Aug 2026 1:46 PM IST
Sherlock Holmes: డిటెక్టీవ్‌ పాత్ర షెర్లాక్‌ హోమ్స్‌ పాపులర్‌ కావడానికి కారణమేంటో తెలుసా?
X

Sherlock Holmes: బ్రిటన్ రాణి కంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన అజరామర డిటెక్టివ్ పాత్ర... షెర్లాక్ హోమ్స్! రచయిత చంపేసినా తట్టుకోలేక తిరగబడిన పాఠకులు... మళ్లీ ప్రాణం పోసుకున్న ప్రసిద్ధ పాత్ర ఏదైనా ఉందా అంటే అది షెర్లాక్స్‌ హోమ్స్‌. కేవలం వాచ్ చూసి మనిషి జాతకం చెప్పేంత నిశిత పరిశీలన... ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుతం అనే చెప్పాలి. ఈ పాత్రపై వచ్చిన పలు సినిమాలు సూపర్‌హిట్‌గా నిలిచాయంటే అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచ సాహిత్య రంగంలో డిటెక్టివ్ నవలలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ ఇంగ్లీష్ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ సృష్టించిన ప్రభంజనం అపూర్వం. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన ఈ పాత్ర, కేవలం కల్పితం మాత్రమే కాక అనేకమందికి నిజంగా బేకర్ స్ట్రీట్‌లో జీవించే మనిషిగా అనిపించేంతగా పాపులర్ అయ్యింది.

వైద్యుడి సృష్టి ... అజరామర పాత్ర

ఎడింబర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మెడికల్ డిగ్రీ పొందిన డాక్టర్ కానన్ డోయల్, తన 27 ఏళ్ల వయస్సులోనే 1887లో "ఎ స్టడీ ఇన్ స్కార్లెట్" నవల ద్వారా షెర్లాక్ హోమ్స్ పాత్రను ప్రపంచానికి పరిచయం చేశారు. మొత్తం 4 నవలలు, 56 చిన్న కథల్లో షెర్లాక్ హోమ్స్ సాహసాలను ఆయన ఆవిష్కరించారు. 1893లో "ది ఫైనల్ ప్రాబ్లమ్" కథలో హోమ్స్ పాత్రను డోయల్ అంతమొందించగా, పాఠకుల నుంచి వచ్చిన విపరీతమైన ఒత్తిడి, నిరసనల కారణంగా మళ్లీ ఆ పాత్రకు ప్రాణం పోసి కథలు రాయాల్సి వచ్చింది.

ఏంటి ఆ పాత్ర ప్రత్యేకత?

షెర్లాక్ హోమ్స్ పరిపూర్ణమైన హీరో కాదు. ఆయనలో విచిత్రమైన అలవాట్లు ఉన్నాయి. ఆడవాళ్లంటే విముఖత, ఆలోచనల కోసం ఆనాటి కాలంలో చట్టబద్ధంగా ఉన్న మోర్ఫిన్, కొకైన్ వాడకం వంటివి ఆయన స్వభావంలో భాగం. కానీ, ఆయనలోని పరిశీలన, అనుమితి, నిరూపణ విధానాలు పాఠకులను మైమరిపిస్తాయి. "ది సైన్ ఆఫ్ ఫోర్" కథలో కేవలం ఒక చేతి గడియారాన్ని చూసి, అది వాట్సన్ అన్నగారిదని, ఆయన అప్పుల పాలై మద్యం వ్యసనానికి గురయ్యాడని క్లూల ద్వారా చెప్పడం ఆయన అసాధారణ మేధస్సుకు ఉదాహరణ. ఆధునిక పరిజ్ఞానం లేని ఆ కాలంలోనే తన హేతుబద్ధమైన ఆలోచనలతో క్రిమినల్ కేసులను ఛేదించి ప్రపంచ డిటెక్టివ్ సాహిత్యానికి హోమ్స్ మార్గదర్శకుడిగా నిలిచారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా, డిటెక్టివ్ సాహిత్యంలో షెర్లాక్ హోమ్స్ సాధించిన ప్రజాదరణ, ఆ పాత్ర సృష్టించిన రికార్డులు చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోవు.

షెర్లాక్‌ హోమ్స్‌ సినిమాలు

సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన ప్రసిద్ధ డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్ నవలల్లోనే కాక, సినిమా వెండితెరపై కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే అత్యధికంగా చలనచిత్రాలు, టీవీ షోలుగా తీయబడిన మానవ కల్పిత పాత్రగా షెర్లాక్ హోమ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. దాదాపు 250కి పైగా సినిమాలు, సిరీస్‌లలో 70 మందికి పైగా నటులు ఈ పాత్రను పోషించారు. ఇక కాలానుగుణంగా ఎన్ని రకాల మార్పులతో వచ్చినా, షెర్లాక్ హోమ్స్ పాత్రకి ఉన్న క్రేజ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఏమాత్రం తగ్గకపోవడమే ఈ పాత్ర సాధించిన విజయంగా చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story