Vamsy Cinematic Magic: వంశీ మార్క్‌ సినిమాలు ఈ తరం దర్శకులు ఎందుకు తీయలేకపోతున్నారు?

ఆ రోజుల్లో వంశీ సినిమాలు స్వచ్ఛమైన భావుకతతో, గోదావరి అందాలను సహజత్వంగా చూపిస్తూ, ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లేవారు. ఇప్పటి దర్శకులు ఎందుకు ఆ మార్క్‌ను అందుకోలేకపోతున్నారో తెలుసుకుందాం.

Balachander
Published on: 8 July 2026 3:03 PM IST
Vamsy Cinematic Magic: వంశీ మార్క్‌ సినిమాలు ఈ తరం దర్శకులు ఎందుకు తీయలేకపోతున్నారు?
X

Vamsy Cinematic Magic: తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వందలాదిమంది దర్శకులు ఎన్నో వేల సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే, మనకు గోదావరి, పల్లెటూరు, వాటి అందాలు, ప్రకృతి సిద్ధమైన రంగులను చూపిస్తూ, ఆ గ్రామాల్లో జరిగే విషయాలను పూసగుచ్చినట్టుగా చెబుతూ, అమాయకత్వాన్ని ఆణిముత్యాల వంటి కళ్లద్వారా పలికించే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన వంశీ అనే చెబుతారు. వంశీ పేరు చెప్పగానే మనకు స్ఫురణకు వచ్చే సినిమాలు లేడీస్‌ టైలర్‌, అన్వేషణ, ఏప్రిల్‌ 1 విడుదల వంటివి. అటువంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈరోజుల్లో, ఈ తరం దర్శకులు ఎందుకు వంశీలా గోదావరిని చూపించలేకపోతున్నారు. కార్పోరేట్‌ చిత్రాలను, భయంకరమైన రక్తపాతాళాలను, హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తివేస్తున్న దర్శకుల్లో గోదారి అందాలు కనిపించడం లేదా అనే ప్రశ్న సగటు సినిమా ప్రేక్షకుడికి కూడా వస్తుంది.

వంశీ చిత్రాల ప్రత్యేకతలు

వంశీ సినిమా తీస్తున్నాడు అంటే దాన్ని ఒక కథలా కాకుండా, ఆక్కడి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. అందులోని భావుకతను తెరపై అందంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. గోదారి పరవళ్లు కావొచ్చు...కోనసీమ కొబ్బరితోటలు కావొచ్చు. ఏదైనా సరే వంశీ మార్క్‌ మ్యాజిక్‌లా మారిపోతుంది. ఆ మ్యాజిక్‌ను నేటితరం దర్శకుడు అందుకోలేకపోవడానికి కారణాలేంటి...తెలుసుకుందాం. ఇప్పటి దర్శకులు గ్రామీణ నేపథ్యం అంటే ఒక స్టూడియోలో సెట్టింగ్‌ వేయడం లేదా విదేశీ లోకేషన్లకు వెళ్లి అక్కడి వాతావరణం చూపిండం చేస్తున్నారు. కానీ, వంశీ మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పల్లెల్లో ఉండి అక్కడి మట్టి వాసనను కెమెరాలో బంధించేవారు కరువయ్యారు. ప్రతీ ఫ్రేమ్‌లోనూ స్వచ్ఛమైన సహజత్వం ఉట్టిపడేలా చూపించడంలో ప్రతి ఒక్కరూ విఫలమౌతున్నారు. హాస్యం అనేది సహజసిద్దంగా ఉండాలి. వంశీ సినిమాల్లో సహజత్వం ఉన్నట్టుగా ఉండాలి. కానీ, ఇప్పటి రోజుల్లో హాస్యం శృతిమించిపోయింది. అంతేకాదు, ఇలయరాజాతో కలిసి వంశీ చేసిన స్వరాల ప్రయోగం మహాద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి పాటలు ఎక్కడా వినిపించడం లేదు.

మొత్తంగా, క్లుప్తంగా చెప్పాలి అంటే సినిమా అన్నది మన హృదయం నుంచి పుట్టాలి. హృదయాంతరాళంలో మొలకెత్తాలి. గోదావరి నీటితో పులకించిపోవాలి. అప్పుడే అజరామరమైన సినిమాలు వస్తాయి. టెక్నాలజీపై పెడుతున్న శ్రద్దలో కేవలం పదోవంతు కథ, కథలోని బావుకత, భావోద్వేగాలపై పెడితే మంచి సినిమాలు తప్పకుండా వస్తాయి. గోదావరి అందాలను మరింత అందంగా చూసుకునే అవకాశం లభిస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story