YouTuber: యూట్యూబర్ కొంపముంచింది వీడియో.. !

YouTuber: సోషల్ మీడియాలో కట్టల కొద్దీ డబ్బు, బంగారం చూపిస్తూ రీల్స్ చేసిన మహిళా యూట్యూబర్ ఇంట్లోనే భారీ చోరీ జరిగింది.

Gagan kumar
Published on: 26 Sept 2026 11:36 AM IST
YouTuber
X

YouTuber: యూట్యూబర్ కొంపముంచింది వీడియో.. !

YouTuber: సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్ల కోసం తమ వద్ద ఉన్న సంపదను బహిరంగంగా ప్రదర్శించడం ఎంతటి ప్రమాదకరమో చెప్పేందుకు కన్యాకుమారి జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం. యూట్యూబ్‌లో తరచూ కట్టల కొద్దీ డబ్బు, కేజీల కొద్దీ బంగారాన్ని చూపిస్తూ రీల్స్ చేసే ప్రముఖ మహిళా యూట్యూబర్ ఇంట్లోనే భారీ చోరీ జరిగింది. దొంగల కంట్లో పడిన ఆ దంపతుల ఆరాటం.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయేలా చేసింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణం ‘విఐపి గార్డెన్’ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త, యూట్యూబర్ వినోద్ కుమార్, మధుమిత దంపతులు నివసిస్తున్నారు. భర్తతో కలిసి సోషల్ మీడియా కోసం వీడియోలు చేసే మధుమిత.. తన పూజా గదిలోనూ, మంచం మీద నగలు, కట్టలు కట్టలుగా ఉన్న డబ్బును వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుండేది.

తమ ఇంట్లో ఉన్న సిరులను ఇలా సోషల్ మీడియాలో బహిరంగంగా చూపించడంతోనే దొంగల కన్ను వీరి ఇంట పడింది. పక్కా రెక్కీ నిర్వహించిన దుండగులు.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన అదను చూసి ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి వెనుక వైపు తలుపులు పగలగొట్టి గుట్టుచప్పుడు కాకుండా లోపలికి ప్రవేశించారు దుండగులు. బీరువాల్లో భద్రపరిచిన సుమారు కిలో పైచిలుకు బంగారం, వజ్రాభరణాలతో పాటు భారీగా నగదును** దోచుకెళ్లారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

షాపింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి వెనుక తలుపులు తెరుచుకుని ఉండటం, అల్మారాలు పగలగొట్టి ఉండటంతో ఆ దంపతులు షాక్‌కు గురయ్యారు. వెంటనే రాజక్కమంగళం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగానే ఈ పక్కా దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇలా సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత జీవితాన్ని, సంపదను బహిరంగంగా ప్రదర్శించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. వర్చువల్ ప్రపంచంలో లైక్‌ల కోసం పాకులాడి, రియల్ లైఫ్‌లో సర్వస్వం కోల్పోకముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.