Suryapet: సూర్యాపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన బాలుడు!

Suryapet: సూర్యాపేటలోని ఓ ఆస్పత్రిలో టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి 14 ఏళ్ల బాలుడు కోమాలోకి వెళ్లడంతో బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 2 Oct 2026 8:05 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన బాలుడు!

Suryapet: టాన్సిల్స్ ఆపరేషన్ కోసం నడుచుకుంటూ వచ్చి నవ్వుతూ ఆపరేషన్ టియేటర్ లోకి వెళ్ళిన 14 ఏళ్ల బాలుడు ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యుల నిర్లక్ష్యంతో కోమాలోకి వెళ్లిన బాలుడి ఘటనలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలుడి ప్రాణం ప్రమాదంలో ఉంటే పట్టించుకోకుండా వైద్యుడు బేరసారాలకు దిగి చివరకు ఖరీదు కట్టాడని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.

ఆక్సిజన్ లేక 15 నిమిషాలు.. బ్రెయిన్ డ్యామేజ్:

సూర్యాపేట పట్టణ కేంద్రం చంద్రన్నకుంటకు చెందిన తారక్ (14) కు శ్వాస ఇబ్బందితో కొత్త బస్టాండ్ సమీపంలోని ఆనంద్‌రావు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన క్షణాల్లోనే బాలుడు ఆక్సిజన్ అందక గిలగిలా కొట్టుకున్నాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో 10 నుంచి 15 నిమిషాల పాటు ఆక్సిజన్ అందలేదు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమాలోకి వెళ్లాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణానికి ఖరీదు కట్టిన వైద్యుడు:

బాలుడి పరిస్థితి విషమించిందని తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. అయితే బాధ్యత వహించ వలసిన వైద్యుడు బాలుడి ప్రాణానికి బేరసారాలకు దిగాడని ఆరోపణలు వస్తున్నాయి. బాలుడి చికిత్సకు అయ్యే ఖర్చు, తదితర విషయాల్లో రాజీ కుదిర్చుకునేలా ఖరీదు కట్టించే ప్రయత్నం చేశాడని, ఇది వైద్య వృత్తికే మాయని మచ్చగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు.

"మా బాబు నడుచుకుంటూ వచ్చాడు అలాగే తిరిగి రావాలి. డబ్బు కాదు మా బాబు ప్రాణం కావాలి" అంటూ బంధువులు ఆస్పత్రి ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఘటనతో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస వసతులు, అత్యవసర సదుపాయాలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న తీరు మరోసారి బయటపడింది. సరైన వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ, ఆక్సిజన్ సౌకర్యం లేని ఆసుపత్రులపై వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA