Suryapet: మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి లక్షన్నర సాయం అందించిన మిత్రులు

Suryapet: రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ సైదులు గౌడ్ కుటుంబానికి అండగా ఆయన స్నేహితులు. రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేత.

Narsimha Reddy
Published on: 7 Jun 2026 2:44 PM IST
Suryapet
X

Suryapet: మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి లక్షన్నర సాయం అందించిన మిత్రులు

సూర్యాపేట: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు గౌడ్ కుటుంబానికి ఆయన 2007 బ్యాచ్ స్నేహితులు అండగా నిలిచారు. ఆకస్మికంగా సైదులు మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉండగా, స్నేహితులు కలిసి రూ.1,50,000 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా సైదులు స్నేహితులు మాట్లాడుతూ, సహచరుడి కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైనప్పుడు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.

అదే సమయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోవద్దని కోరారు.

సైదులు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి అందరూ సహాయం చేయాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. ఈ సహాయ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, మధుమోహన్ రవి, నాగరాజు, కరుణాకర్, సైదులు, బాలకృష్ణ, మాధవ్ కొండల్ తదితరులు పాల్గొన్నారు.

Narsimha Reddy

Narsimha Reddy

Next Story