Kodad: కోదాడలో మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

Kodad: కోదాడలో సెప్టెంబర్ 19న జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. 300 కంపెనీల ద్వారా 30 వేల ఉద్యోగాలు కల్పించనున్నారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 13 Sept 2026 8:33 PM IST
Kodad
X

Kodad: కోదాడలో మెగా జాబ్ మేళా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

కోదాడ: పట్టణంలో ఈ నెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహతో పాటు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి జాబ్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

మెగా జాబ్ మేళాకు భారీగా యువత హాజరయ్యే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ జాబ్ మేళాలో సుమారు 300 కంపెనీలు పాల్గొని 30 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, ఉద్యోగార్థులు ముందుగానే తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

గ్రామాల వారీగా జాబ్ మేళాపై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రతి నిరుద్యోగ యువతకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు అన్ని శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం మెగా జాబ్ మేళా పోస్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. మరోవైపు నీటి కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉందని, దీంతో సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని రైతులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని, అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD