Suryapet: సూర్యాపేట జిల్లాలో రూ.500 కోట్ల సిఎంఆర్ బియ్యం కుంభకోణం!

Suryapet: జిల్లాలో సుమారు రూ. 500 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) బియ్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో వెల్లడైంది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 4 Aug 2026 7:38 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో రూ.500 కోట్ల సిఎంఆర్ బియ్యం కుంభకోణం!

సూర్యాపేట: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదవాడి ఆకలి తీర్చాల్సిన బియ్యం.. కొందరు రైస్ మిల్లర్ల వ్యాపార దాహానికి బలైపోయింది. “కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ఇష్టంగా మింగారు” అన్న చందంగా సూర్యాపేట జిల్లాలో సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టింది. ప్రభుత్వ ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్న వ్యాపారుల బండారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు.

4 ఏళ్లుగా సాగుతున్న దోపిడీ పర్వం

2022-23 సీజన్ నుండి జిల్లాలో ఈ అక్రమాల పర్వం అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చకుండా మార్కెట్లో అమ్ముకోవడం మిల్లర్లకు అలవాటుగా మారింది. బకాయి పడిన బియ్యాన్ని ఆగస్టు 5 నాటికి తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశించినా మిల్లర్లలో చలనం రాలేదు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్లై అధికారులు 6గురు సభ్యుల ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగి చేపట్టిన మెరుపు దాడుల్లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి.

తనిఖీల్లో తేలిన లెక్కల చిట్టా (రూ. 224 కోట్లకు పైగా అక్రమాలు):

గాంధీనగర్ (వజ్ర వికాస్ & వజ్ర రైస్): 29,197 టన్నులు (రూ. 73 కోట్లు)

సూర్యాపేట (రవికృష్ణ రైస్ మిల్లు): 12 టన్నులు (రూ. 47.62 కోట్లు)

అన్నారం (ASR రైస్ మిల్లు): 19,701 టన్నులు (రూ. 46 కోట్లు)

కాసరబాద (శ్రీ వెంకటేశ్వర మిల్లు): 11,400 టన్నులు (రూ. 27.23 కోట్లు)

సూర్యాపేట (శివసాయి రైస్ మిల్లు): 2,900 టన్నులు (రూ. 13 కోట్లు)

అన్నారం (JP రైస్ మిల్లు): 4,886 టన్నులు (రూ. 11.67 కోట్లు)

దొండపాడు (శివసుబ్రహ్మణ్యేశ్వర మిల్లు): 2,050 టన్నులు (రూ. 4.89 కోట్లు)

కేసులకు బెదిరేదే లేదు.. బెయిలే మా దారి!

ఈ స్థాయిలో ప్రజాధనాన్ని కొల్లగొట్టినా మిల్లర్లలో ఏమాత్రం భయం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసులు నమోదైనా సులభంగా బెయిల్ పొంది బయటకు వచ్చి, ఏమీ ఎరుగనట్టు సమాజంలో తిరుగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

కఠిన చర్యలకు డిమాండ్

పేదల కడుపు కొట్టి కోట్ల రూపాయలు కాజేసిన ఈ 'కిలాడీ' మిల్లర్ల మిల్లింగ్ లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని, రికవరీ చట్టాల ప్రకారం వడ్డీతో సహా సొమ్మును రికవరీ చేసి, దోషులను జైలుకు పంపాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story