Suryapet: NH-65 వెంట సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ నడపాలి: అఖిలపక్ష భేరీ!
Suryapet: హైదరాబాద్ - విజయవాడ NH-65 వెంట సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ నిర్మించాలని అఖిలపక్ష భేరీ డిమాండ్ చేసింది.
Suryapet: NH-65 వెంట సూర్యాపేట మీదుగానే బుల్లెట్ ట్రైన్ నడపాలి: అఖిలపక్ష భేరీ!
సూర్యాపేట: ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు సూర్యాపేటను చిన్నచూపు చూస్తున్నారని, కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్‌ను ఏదో ఒక సాకుతో పక్కదారి పట్టిస్తున్నారని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆరోపించింది. NH-65 రహదారి వెంట ఉన్న ప్రజలు ఆందోళనకు సిద్ధం కావాలని సమితి అఖిలపక్ష కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకి రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో రైల్వే కారిడార్ ముఖ్య సలహాదారు రమణాచారి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరిలో కేంద్రం శంషాబాద్ కారిడార్‌గా మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌ను తిరిగి శంషాబాద్ నుంచి సూర్యాపేట, అమరావతి మీదుగా చెన్నైకి మార్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత మార్పుతో NH-65 వెంట ఉన్న తెలంగాణ పట్టణాలు, పల్లెలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
"చేతికొచ్చినట్లే వచ్చి బుల్లెట్ ట్రైన్ జారిపోతుంది. ఇప్పుడు వదిలేస్తే జీవితకాలం రైలు కోసం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. రెండు రాజధానులను కలుపుతూ పట్టణాలు, జిల్లా కేంద్రాల మీదుగా వెళ్లాల్సిన మార్గాన్ని గుట్టల గుండా మార్చడం మూర్ఖత్వం" అని ప్రొఫెసర్ జానకి రెడ్డి అన్నారు. ఆర్థిక అంశాలను పక్కనపెట్టి పాలకుల లాబీయింగ్‌తోనే రూట్ మారుస్తున్నారని ఆరోపించారు.
సమావేశంలో మాట్లాడిన జాతీయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్ రావు 85 ఏళ్లుగా సూర్యాపేటలో ఉంటున్నా ఇప్పటికీ రైలు చూడలేదని భావోద్వేగంగా చెప్పారు. నర్సంపేట నుంచి వీడియో కాల్‌లో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, కేంద్రం మొదట ప్రకటించిన ప్రకారమే NH-65 వెంట బుల్లెట్ ట్రైన్ వేస్తేనే తెలంగాణకు ఉపయోగమని, ఉద్యమానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ ప్రకటన
విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్ రాబోయే కార్యక్రమాలను వెల్లడించారు:
- ఈ నెల 13: పట్టణంలోని అన్ని కేంద్రాల వద్ద విద్యార్థుల మహా ర్యాలీ
- 14: సూర్యాపేటలో దీక్షా శిబిరం ప్రారంభం
- 20: వంట వార్పు
- 22: రాత్రి 7 గంటలకు లక్ష గొంతుకలతో ఇంటి ముందు నుంచే నినాదాలు
- 2: హైవేపై వంట వార్పు
- 25: జల దీక్ష
- 27: హైవే దిగ్బంధం
- 29: రక్షాబంధన్
- 30: NH-65పై పట్టణాల బంద్
చౌటుప్పల్ నుంచి కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, అన్ని ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, మహిళా, కార్మిక, కర్షక సంఘాలను కూడగట్టాలని సమావేశం తీర్మానించింది.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, బీజేపీ నేత చల్లమల్ల నర్సింహ, కాంగ్రెస్ నేత అనుములపురి రవి, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, టీజేఎస్ నేతలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




