Gundala: గుండాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన!

Gundala: గుండాల తహసీల్దార్ కార్యాలయంలో రూ.30 లక్షలు తీసుకొని 9 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు. కార్యాలయం ఎదుట బాధితుల నిరసన.

RAMESH, MOTHUKUR
Published on: 23 Sept 2026 5:13 PM IST
Gundala
X

Gundala: గుండాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన!

Gundala: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తహసీల్దార్ కార్యాలయంలో సర్వే నెంబర్లు ఎగరగొట్టి, భూ రికార్డులు మార్చి తహసీల్దార్ ఇతరుల పేరున అక్రమంగా 9 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. రికార్డులు మార్చి భూమిని ఇతరుల పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయడంతో బాధిత కుటుంబం గుండాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. తహసీల్దార్ ను నిలదీయడంతో వాగ్వివాదం జరిగింది.

బాధితుల కథనం ప్రకారం గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన ఆలేటి మల్లారెడ్డి కి నలుగురు కుమారులు కాగా అందులో నాలుగో కుమారుడు లక్ష్మారెడ్డి తన భాగానికి వచ్చిన సర్వే నెంబర్లు 237, 238లో 9.05 ఎకరాల భూమిపై 30 ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిపై వివాదంతో పాటు కోర్టు కేసు కూడా నడుస్తోంది. రాంరెడ్డి, కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి కలిసి మిస్సింగ్ నెంబర్ తో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రయత్నించగా అప్పటి ఎమ్మార్వో రిజెక్ట్ చేసింది.

2014 ముందు ఉన్న మూడు రకాల పహాని రికార్డులు మార్చడంతో పాటు భూభారతిలో చూపించిన 237, 238 సర్వే నెంబర్లను తొలగించి, వాటి స్థానాల్లో కొత్త సర్వే నెంబర్లు సృష్టించి 9.05 ఎకరాల భూమిని ఆ ముగ్గురు కలిసి ఇటీవల రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తహసిల్దార్, సీనియర్ అసిస్టెంట్ కలిసి రికార్డులను మార్చారని, రూ.30 లక్షలు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్ పై బాధిత కుటుంబం ఆధారాలతో భువనగిరి ఆర్డీవోకు సమర్పించడంతో ఆయన విచారణకు ఆదేశించారు. కలెక్టర్ స్పందించి అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, భూమి గత పట్టాను యధావిధిగా మార్చాలని, తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో కార్యాలయం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

RAMESH, MOTHUKUR

RAMESH, MOTHUKUR