Nalgonda: కొండమల్లేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ఆరోపణల కలకలం!
Nalgonda: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, సర్పంచ్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Nalgonda: కొండమల్లేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై ఆరోపణల కలకలం!
Nalgonda: నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల పరిధిలోని ఓ తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల విషయంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకరి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే, ఆ ఇంటిని మరొకరు నిర్మించుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, తన పేరు మీద మంజూరైన ఇంటిని మీరు నిర్మించుకోండి, అందుకు ప్రతిఫలంగా తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని ఓ సర్పంచ్ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాగా, ఇలాంటి వ్యవహారాలు చోటుచేసుకుంటే అర్హులైన పేదలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.




