Nalgonda: బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోండి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరిక

Nalgonda: బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు బీఫ్ షాపుల యజమానులు, నిర్వాహకులతో డిఎస్పీ కె. శివరాం రెడ్డి సమీక్ష సమావేశం.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 9 May 2026 9:26 PM IST
Nalgonda
X

Nalgonda: బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోండి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరిక

బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు బీఫ్ షాపుల యజమానులు, నిర్వాహకులతో డిఎస్పీ కె. శివరాం రెడ్డి సమీక్ష సమావేశం..బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో శాంతిభద్రతలు, పరిశుభ్రత మరియు సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో డిఎస్పీ కె. శివరాం రెడ్డి స్థానిక కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులు మరియు బీఫ్ షాపుల యజమానులతో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. రానున్న బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నిషేధిత జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వధించకూడదని, జంతువుల రవాణా సమయంలో వెటర్నరీ డాక్టర్ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన జంతువుల వధ పూర్తిగా నిషేధమని తెలిపారు. బీఫ్ షాపుల యజమానులు తమ వ్యాపార ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరదాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పండుగ సందర్భంగా పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మిగిలిన జంతు వ్యర్థాలను రోడ్లపై లేదా మురుగు కాలువల్లో పారవేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వ్యర్థాలను మందపాటి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, మున్సిపల్ అధికారులు కేటాయించిన వాహనాల్లో లేదా నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేయాలని తెలిపారు.

దీనిపై కార్పొరేటర్లు తమ వార్డుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పరిశుభ్రమైన వాతావరణం కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.సోషల్ మీడియా వినియోగంపై కూడా డిఎస్పీ ప్రత్యేకంగా అప్రమత్తం చేశారు. కుర్బానీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని సూచించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు లేదా సందేశాలు పంపించే వారిపై ఐటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించినా వెంటనే డయల్-100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా డిఎస్పీ కె. శివరాం రెడ్డి మాట్లాడుతూ, “బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక. ఈ పండుగను అందరూ సోదరభావంతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలి. ప్రజలు, వ్యాపారులు, మత పెద్దలు పోలీసు శాఖకు మరియు మున్సిపల్ అధికారులకు సహకరించి పట్టణంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story