Suryapet: మంత్రి కొడుక్కి ఒక చట్టమా? సూర్యాపేటలో సెగలు!

Suryapet: బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నేత బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 11 May 2026 1:58 PM IST
Suryapet
X

Suryapet: మంత్రి కొడుక్కి ఒక చట్టమా? సూర్యాపేటలో సెగలు!

సూర్యాపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.

తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేద బీసీ బలహీన వర్గానికి చెందిన మైనర్ బాలికపై భగీరథ మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేసి చిత్రహింసలకు పాల్పడడం దుర్మార్గమని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడే ఇంతటి ఘాతుకానికి పాల్పడడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు.

ఫోక్సో కేసు నమోదైనప్పటికీ భగీరథను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని లింగయ్య యాదవ్ విమర్శించారు. “సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారుడికి మరో చట్టమా?” అని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబం తమ గోడు విన్నవించి ఆత్మహత్య చేసుకుంటామని తెలిపిన తర్వాతే ఫోక్సో కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. అయితే కేసులో సెక్షన్లు 5, 7 పెట్టకుండా సెక్షన్ 11 మాత్రమే పెట్టడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భగీరథను ఫోక్సో కేసు కింద అరెస్టు చేసి, బాధిత కుటుంబాన్ని వేధింపుల నుంచి కాపాడాలని కోరారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బండి సంజయ్ పై కేసు నమోదు చేయడంతో పాటు ఆయన కుమారుడిని వెంటనే అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి పోరాడుతుందని స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story