Suryapet: కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్!

Suryapet: సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్, రైతులు భారీ ధర్నా చేపట్టారు. ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 7 July 2026 4:00 PM IST
Suryapet
X

Suryapet: కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్!

Suryapet: కన్నెపల్లి పంప్ హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం భారీ ఆందోళన జరిగింది.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకుల నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను పట్టించుకోవడం లేదని, కాళేశ్వరం జలాలను అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు.

రైతుల పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసే అవకాశం ఉన్నా కావాలనే కాలయాపన చేస్తోందని విమర్శించారు. యుద్ధప్రాతిపదికన పంప్‌హౌస్ ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి అంశంలో రాజకీయాలు పక్కనపెట్టి రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

కలెక్టరేట్ ముట్టడితో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గోదావరి జలాలు విడుదల చేయకుంటే, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story