Miryalaguda: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ జాప్యంపై బీఆర్‌ఎస్ ఆందోళన!
Miryalaguda: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Miryalaguda: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ జాప్యంపై బీఆర్‌ఎస్ ఆందోళన!
మిర్యాలగూడ: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో జాప్యాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాల లబ్ధి అర్హులకు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ఆర్డీవో రమణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని కోరారు.
అదేవిధంగా ఒంటరి మహిళా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే మహిళలకు ఎమ్మార్వో కార్యాలయం ద్వారా అవసరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా జారీ చేయాలని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయకుండా మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.




