Kodada: కోదాడలో ఘోరం రోడ్డు ప్రమాదం కాదు హత్య.. సీసీ కెమెరాతో బయటపడ్డ నిజాం
Kodada: కోదాడలో లారీ కింద నెట్టి యాకూబ్ అనే యువకుడిని హత్య చేసిన మహేష్. బార్ గొడవే కారణం. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
Kodada: కోదాడలో ఘోరం రోడ్డు ప్రమాదం కాదు హత్య.. సీసీ కెమెరాతో బయటపడ్డ నిజాం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రోడ్డు ప్రమాదంగా అందరు అనుకున్న ఘటన హత్యోదంతం సీసీ కెమెరా పుణ్యమా అని బయటపడింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఒక బార్‌లో జూన్ 30న ముగ్గరు యువుకులు కలిసి మద్యం సేవించే క్రమంలో మహేష్, రమేష్ అనే ఇద్దరు యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఈ గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన యాకూబ్‌ను నిందితుడు మహేష్ బార్‌లోనే కాలితో తన్నాడు. గొడవ పెరగడంతో బార్ నిర్వాహకులు ఆ ముగ్గురిని బయటకు పంపించేశారు.
బార్ బయటకు వచ్చిన తర్వాత కూడా నిందితుడు మహేష్ ఆగలేదు, పట్టణంలోని మేళ్లచెరువు రోడ్డు సిగ్నల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న యాకూబ్‌ను మరల వెనుక నుండి వచ్చి బలంగా తన్నాడు. మహేష్ తన్నడంతో యాకూబ్ అదుపు తప్పి పక్కనే వస్తున్న లారీ కింద పడిపోయాడు. లారీ వెనుక టైర్లు యాకూబ్‌పై నుండి వెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన జరిగినప్పుడు ఇది కేవలం ఒక యాక్సిడెంట్ అని లారీ డ్రైవర్‌పై నెట్టే ప్రయత్నం జరిగింది. అయితే పోలీసులు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో, అసలు నిందితుడు మహేష్ అని తేలింది. సీసీ పుటేజీలో నిందితుడు మహేష్ చేసిన దారుణం స్పష్టంగా రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. మద్యం మత్తులో చేసిన చిన్న గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు




