Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘనంగా వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభం!

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కోత విధిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరిక.

PARAMESH, NALGONDA & SURYAPET
Updated on: 24 Sept 2026 6:37 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఘనంగా వయోవృద్ధుల వారోత్సవాలు ప్రారంభం!

Suryapet: సమాజానికి, కుటుంబానికి మార్గదర్శకులైన వయోవృద్ధులను గౌరవించి, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వారం రోజుల పాటు నిర్వహించే వయోవృద్ధుల వారోత్సవాల గోడ పత్రికను గురువారం కలెక్టరేట్‌లోని వీసీ ఛాంబర్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.

మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపకుండా, ఇంట్లోనే ఉంచుకొని ప్రేమగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు హితవు పలికారు. వృద్ధుల రక్షణ, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ చట్టం గురించి వివరించారు.

తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేసే పిల్లల స్థూల వేతనం నుంచి నేరుగా 15 శాతం లేదా గరిష్టంగా రూ.10 వేల వరకు కట్ చేసి, తల్లిదండ్రుల ఖాతాకు జమ చేసేలా కఠిన నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. వృద్ధుల హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వృద్ధుల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి, చట్టప్రకారం న్యాయం చేస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం కేటాయించిన ఉచిత టోల్‌ఫ్రీ నంబర్ 14567 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

వారం రోజుల పాటు కార్యక్రమాలు

సెప్టెంబర్ 24: వృద్ధుల శ్రేయస్సు, సాధికారత వారోత్సవాల ప్రారంభం, పోస్టర్ల ఆవిష్కరణ.

సెప్టెంబర్ 25: వృద్ధుల ఆరోగ్య, సంరక్షణ దినోత్సవం – వృద్ధాశ్రమాలలో వినోద కార్యక్రమాలు, ఇండోర్ ఆటలు.

సెప్టెంబర్ 26: వృద్ధాశ్రమాల సామర్థ్య పెంపు – సిబ్బందికి కనీస ప్రమాణాలు, సంరక్షణపై శిక్షణ మరియు తనిఖీలు.

సెప్టెంబర్ 28: సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత – వృద్ధులపై వేధింపులు, మోసాలు, దోపిడీల నివారణపై అవగాహన.

సెప్టెంబర్ 29: తరాల మధ్య అనుబంధం – పాఠశాలల్లో విద్యార్థులు, వారి తాతా-బామ్మలతో కలిసి ఆత్మీయ కలయికలు.

సెప్టెంబర్ 30: యాక్టివ్ ఏజింగ్, వెల్‌నెస్ మరియు ఇంటర్-జనరేషనల్ వాకథాన్.

అక్టోబర్ 01: జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహణ.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు సీతారామయ్య, జి.విద్యాసాగర్, ఎస్డీ హమీద్ ఖాన్, ఇరిగే కోటేశ్వరి, గజ్జల కృష్ణారెడ్డి, వినోద్ కుమార్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET