Suryapet: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Suryapet: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేసి, ఉదయం 9 గంటలకే బయోమెట్రిక్ హాజరు వేయాలని, ఓపీలో ప్రొఫెసర్లు ఉండాలని ఆదేశించారు.
Suryapet: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
సూర్యాపేట: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రిలో పలు కీలక మార్పులు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
శనివారం ఉదయం ఆయన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు, ఓపీ సేవలు, వార్డుల పనితీరును పరిశీలించారు. విధులకు ఆలస్యంగా వచ్చే వారిపై, డ్యూటీలో నిర్లక్ష్యం వహించే వారిపై అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తప్పనిసరి విధులు ఆసుపత్రి సిబ్బంది పనివేళలపై కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందరూ విధుల్లో ఉండాలని, 100 శాతం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. ఉదయం ఇన్ టైం పంచ్ చేయకపోయినా, సాయంత్రం ముందుగా వెళ్లిపోయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ఓపీలో సీనియర్ ప్రొఫెసర్లు ఉండాలి ఓపీ విభాగాల్లో జూనియర్ డాక్టర్లపైనే భారం వేయవద్దని, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లినికల్ అవర్స్‌లో తప్పనిసరిగా అందుబాటులో ఉండి రోగులను స్వయంగా పరీక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతిరోజూ ఫీవర్ కేసులు, అడ్మిషన్లు, డిశ్చార్జ్ వివరాలను అప్‌డేట్ చేయాలని, మందులకు కొరత రాకుండా బఫర్ స్టాక్ ఉంచుకోవాలని సూచించారు.
CSR నిధులతో కొత్త పరికరాలు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు లాపరోస్కోపిక్ సెట్స్, అడ్వాన్స్డ్ లాపరోస్కోపీ టవర్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు లేదా కలెక్టరేట్ గ్రాంట్ల ద్వారా సమకూర్చనున్నట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో డాక్టర్లు జనార్ధన్, అనిత, ఉపేందర్, యశ్వంత్, గీత, సంధ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు.




