Suryapet: పీఎంశ్రీ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ తెరిచిన కలెక్టర్!
Suryapet: పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించి, త్వరలో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం కానుందని తెలిపారు.
Suryapet: పీఎంశ్రీ స్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ తెరిచిన కలెక్టర్!
సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
సూర్యాపేట పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడే తొలిసారి కంప్యూటర్ చూశానని గుర్తుచేశారు. నేటి డిజిటల్ యుగంలో పుస్తకాల చదువుతో పాటు డిజిటల్ విద్య అత్యవసరమని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టీ-ఫైబర్, ఏఆర్/విఆర్ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో కోడింగ్ నేర్పిస్తున్నామని తెలిపారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లర్నింగ్ పుస్తకాలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
అడ్మిషన్లు పెరిగాయి, రూ.10 లక్షలు విడుదల..
సూర్యాపేట జెడ్పీహెచ్ఎస్‌లో గతేడాది 10వ తరగతి ఫలితాలు బాగుండటం, మౌలిక వసతులు మెరుగుపడటంతో ఈ ఏడాది 121 మంది కొత్త విద్యార్థులు చేరారని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 10,113 మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అందరూ కృషి చేయడాన్ని అభినందిస్తూ, మౌలిక వసతుల కోసం వెంటనే రూ.10 లక్షల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు కలిసి ఈ పాఠశాలను జిల్లాలోనే ‘బెస్ట్ స్కూల్’గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
బడిలోనే ఉచిత అల్పాహారం..
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పిన కలెక్టర్, నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు త్వరలో ప్రతిరోజూ ఉదయం ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆరోగ్యకరమైన శరీరం ఉంటేనే చురుకైన మెదడు ఉంటుందని, విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.
చదువొక్కటే పేదరికాన్ని జయిస్తుంది: పటేల్ రమేష్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, పేదరికం పోవాలన్నా, సమాజంలో గౌరవంగా నిలబడాలన్నా చదువే ఏకైక మార్గమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాఠశాలను దత్తత తీసుకొని మోడల్ స్కూల్‌గా మారుస్తానని ఇచ్చిన మాట మేరకు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
పాఠశాల విద్యార్థుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ ఆధ్వర్యంలో డ్యూయల్ డెస్క్ బెంచీలు, సొంత నిధులతో వారం రోజుల్లో డిజిటల్ బోర్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. సైన్స్ ల్యాబ్, డైనింగ్ హాల్, పాఠశాల బెల్ వంటి వసతులను కూడా త్వరలో సమకూరుస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యాశాఖ కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని, సైన్స్ ల్యాబ్‌లు, స్కూల్ బ్యాగులు, డ్రెస్సులు, మౌలిక వసతులు సమర్థవంతంగా అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ జి.శ్రీనివాస్ రావు, మున్సిపల్ కౌన్సిలర్ వెంకన్న, డీఈఓ అశోక్, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




