Nalgonda: ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితే నల్గొండలో నీటి కరువు ఉండదు!

Nalgonda: ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితే నల్గొండ జిల్లాలో నీటి కరువు తీరుతుందని, రైతన్నలకు సాగునీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 5 Nov 2026 1:41 PM IST
Nalgonda
X

Nalgonda: ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితే నల్గొండలో నీటి కరువు ఉండదు!

Nalgonda: ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గం పూర్తయితే ఎంత కరువు వచ్చినా శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుండి నీటిని తీసుకొని రైతులకు సాగునీరు అందించవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ప్రమాణస్వీకారానంతరం మంత్రి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు అత్యంత కీలకమైనవని, రైతులకు సంబంధించి ఈ పదవులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, రైతులకు సేవ చేసే అవకాశం వీటి ద్వారా లభిస్తుందని అన్నారు.

నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ మార్కెట్ కు సంబంధించి రెండవ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తును ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో అమలు చేస్తున్నాయని, ఇది గర్వకారణం అని అన్నారు.

ఎస్ఎల్బీసీ ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించడమే కాకుండా జిల్లా అంతటికి సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వ హాయంలో నిలిచిపోగా, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను తిరిగి చేపట్టామని, దురదృష్టవశాత్తు మధ్యలో మళ్లీ పనులు ఆగగా ఇటీవలే పనులు ప్రారంభించి చురుకుగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

బ్రాహ్మణ వెల్లేములను కూడా తమ హయాంలోనే చేపట్టడం జరిగిందని, ఇప్పటివరకు 35000 ఎకరాలకు సాగునీరు అందించగా, లక్ష ఎకరాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్బీసీ ద్వారా జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు సేవ చేయడం అదృష్టంగా ప్రతి ఒక్కరు భావించాలని అన్నారు.

ఏఎంఆర్పి కాలువల లైనింగును 450 కోట్ల రూపాయలు తో చేపట్టడం జరిగిందని, ముశంపల్లి సబ్ స్టేషన్ మంజూరు చేయించడం జరిగిందని, అలాగే రోడ్డు మంజూరు చేయించామని తెలిపారు. జిల్లాలో కాలువలు ,రిజర్వాయర్లు పూర్తయితే చుట్టుపక్కల బోర్లు రీఛార్జ్ అవుతాయని అన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా, రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి ,జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి, తదితరులు హాజరయ్యారు.

కాగా నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బి. హేమలత వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా వి .శ్రీనివాస్ గౌడ్ తో పాటు ,డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదేవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET