Suryapet: భూముల రీసర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి!

Suryapet: రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 12 Nov 2026 11:03 AM IST
Suryapet
X

Suryapet: భూముల రీసర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి!

Suryapet: రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వేలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటుతో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అంశాలపై సమీక్షలు నిర్వహించామని తెలిపారు. రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రౌండ్ రిపోర్టులను సేకరిస్తున్నామని, రీసర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, లోపాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని పేర్కొన్నారు.

భూముల రీసర్వేకు సంబంధించి రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)ను అధికారులు పక్కాగా అమలు చేయాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు, సవరణలు చేపట్టాలని తెలిపారు. కేవలం ఉన్నతాధికారులను సంతృప్తిపరిచే నివేదికలు కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు ఉండాలని స్పష్టం చేశారు.

నవంబర్ నెలాఖరులోగా తొలి విడత పూర్తి చేయాలి

నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రీసర్వే పనుల్లో అధికారులు పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో వ్యవహరించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతి మండలంలో రీసర్వే కోసం అవసరమైన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

రీసర్వే పనులను వేగవంతం చేసేందుకు సర్వే బృందాల సంఖ్యను పెంచాలని తెలిపారు. రాబోయే ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు.

పారదర్శకత, నాణ్యత తప్పనిసరి

రీసర్వే జరిగే సమయంలో సంబంధిత గ్రామాల రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, స్థానిక రైతుల సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. సర్వే నివేదికలపై అభ్యంతరాలు ఎలా సమర్పించాలి, ఎక్కడ సమర్పించాలి, ఏ విధంగా పరిష్కరించబడతాయి అనే అంశాలపై ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే వివరాలను ప్రజలకు తెలియజేస్తూ దండోరా వేయించాలని, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. ప్రజలకు రీసర్వే వివరాలు పూర్తిస్థాయిలో తెలియజేయాలని, వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రికార్డులు కచ్చితత్వంతో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

అసైన్డ్ భూముల పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

అసైన్డ్ భూములకు సంబంధించి పట్టాలు అసలైనవా, నకిలీవా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని మంత్రి సూచించారు. పట్టా పొందిన వ్యక్తులే ప్రస్తుతం ఆ భూములపై ఆధీనంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని తెలిపారు.

గతంలో ఒకరికి పట్టా ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మరొకరు భూమిని అనుభవిస్తున్నట్లయితే, ప్రస్తుత అనుభవదారుడు అర్హుడా కాదా అనే అంశాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించాలని ఆదేశించారు. పట్టాలో పేర్కొన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణానికి మధ్య తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని తెలిపారు.

సాగునీటి చెరువులు, రహదారులు, కుంటలు, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో భూసేకరణ చేసిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

రీసర్వేలో ఏ అధికారి అయినా అక్రమాలకు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా, రీసర్వే ప్రక్రియను నాణ్యతతో, పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, సూర్యాపేట, కోదాడ, హుజుర్‌నగర్ ఆర్‌డీఓలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడి శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA