Nalgonda: భార్య చనిపోయినా రాని భర్త.. నల్గొండ హైవేపై శవంతో కూతుళ్ల ధర్నా!

Nalgonda: దామరచర్లలో తీవ్ర ఉద్రిక్తత.. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై మృతదేహంతో బంధువుల రాస్తారోకో.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 17 May 2026 8:45 PM IST
Nalgonda
X

Nalgonda: భార్య చనిపోయినా రాని భర్త.. నల్గొండ హైవేపై శవంతో కూతుళ్ల ధర్నా!

నల్గొండ జిల్లా: దామరచర్ల మండల కేంద్రంలో గుండెలను పిండేసే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అనారోగ్యంతో కన్నుమూస్తే.. కనీసం చివరి చూపుకైనా రాని ఒక కఠిన హృదయుడైన భర్త తీరు స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. 20 ఏళ్ల దాంపత్య జీవితం.. ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుళ్లు.. కానీ, ఆ ఇంట్లో రేగిన కుటుంబ కలహాలు ఒక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన బైరం శ్రీకాంత్, లక్ష్మిలకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో శ్రీకాంత్ భార్యాపిల్లలను వదిలి దూరంగా ఉంటున్నాడు. పెళ్లీడుకు వచ్చిన ఇద్దరు కుమార్తెలను సాకుతూ లక్ష్మి గ్రామంలోనే ఒంటరిగా జీవనం సాగిస్తోంది.

కుటుంబ సమస్యలపై బాధితురాలు పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే మనస్తాపంతో బాధపడుతున్న లక్ష్మి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యం అందకపోవడంతో శనివారం ఆమె మృతి చెందింది. తల్లి చనిపోయిన సమాచారాన్ని భర్త శ్రీకాంత్‌కు అందించినప్పటికీ.. అంత్యక్రియలకు రావడానికి సైతం ఆయన నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బంధువులు, కుమార్తెలు లక్ష్మి మృతదేహంతో కలిసి అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపైకి చేరుకుని రాస్తారోకోకు దిగారు.గత ఐదేళ్లుగా మా తండ్రి మమ్మల్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాడు. ఆ బాధలు భరించలేకే మా అమ్మ ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. ఇప్పుడైనా మా తండ్రి ఇక్కడికి వచ్చి.. మా అమ్మకు హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాలి" అంటూ కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ​

ఈ నిరసన కారణంగా హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story