Devarakonda: రానున్న 10 నెలలు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి

Devarakonda: దేవరకొండలో ఎల్‌నినో ప్రభావంపై సర్పంచులు, సెక్రటరీలతో కలెక్టర్ బి.చంద్రశేఖర్ సమీక్ష. రానున్న 10 నెలలు తాగునీటి కొరత లేకుండా చర్యలకు ఆదేశం.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 23 Oct 2026 6:46 PM IST
Devarakonda
X

Devarakonda: రానున్న 10 నెలలు తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి

దేవరకొండ: రానున్న పది నెలల పాటు గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో కోరారు. గ్రామాల్లో పైపులైన్ లీకేజీలు ,ఇతరత్రా నీటి వృధా లేకుండా నివారించి నీటి వృధా లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ కోరారు.

శుక్రవారం దేవరకొండా లోని ఒక ప్రయివేట్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో "ఎల్‌నినో ప్రభావం- తీసుకోవలసిన చర్యలపై సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎల్ నినో వల్ల వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమన్నారు. గ్రామాల్లో చెరువులు, మిషన్ భగీరథ, బోర్లు, కాలువలు, వర్షపు నీటి ద్వారా లభించే నీటి నిల్వలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామాలలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, నీటి నిల్వల వివరాలను గ్రామ కార్యదర్శులు తెలుసుకుని, వాటిని రానున్న నెలల్లో అవసరాలకు సరిపడా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.

జూలై వరకు నీటి కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు నీటి సంరక్షణ చర్యలలో భాగంగా గ్రామాలలో పైపులైన్ లీకేజీలను అరికట్టాలని, ఇంకుడు గుంతల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీరు, సాగునీటికి ఎంత అవసరమో అంతే వినియోగిస్తూ నీటి పొదుపు సూత్రాలను ప్రజలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు.

విద్యుత్తును కూడా పొదుపుగా వినియోగించి సంక్షోభాన్న అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు రానున్న రోజుల్లో తక్కువ నీటితో పండించే ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, మినుములు, కందులు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.

సుమారు 30 మంది రైతులు ఒక సమూహంగా ఏర్పడి సమిష్టి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలని, పండించిన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో కూలీలకు పని కల్పించాలని, పశుసంపదను సంరక్షిస్తూ పశువులకు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.

మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, గ్రామాలలో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, ఎంపీడీవోలు పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలని చెప్పారు. చేపట్టిన పనులకు కొలతల పుస్తకాల ప్రకారం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామీణ ప్రజలకు అవసరమైన రేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కొత్త పంచాయతీల్లో రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పరిష్కారానికి కూడా చర్యలు చేపడతామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రకృతి వైపరీత్యంగా భావించి, సమష్టి కృషితో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు అనంతరం కలెక్టర్ సర్పంచులతో కలిసి క్రింద కూర్చుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావం నివారణ, నీటి పొదుపుపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో దేవరకొండ సబ్ కలెక్టర్ కరోలిన్ చింగ్తి యాన్ మావి,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ట్రైనీ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్ , పశు సంవర్ధక శాఖ అధికారి జివి రమేష్, డిపిఓ తరుణ్ చక్రవర్తి, ఇంచార్జ్ఎంపీడీవో పార్వతి, అధికారులు, సర్పంచులు, సెక్రటరీలు పాల్గొన్నారు .

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA