Devarakonda: పట్టభద్రుల ఎమ్మెల్సీగా సర్వోత్తం రెడ్డిని గెలిపించండి
Devarakonda: ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ పిలుపు.
Devarakonda: పట్టభద్రుల ఎమ్మెల్సీగా సర్వోత్తం రెడ్డిని గెలిపించండి
దేవరకొండ: ఉమ్మడి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు పిలుపునిచ్చారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు విడివిడిగా నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ గారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడని పేర్కొన్నారు. ప్రజాసేవకు, కాంగ్రెస్ పార్టీకి అంకితమైన త్యాగాల కుటుంబానికి చెందిన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సర్వోత్తం రెడ్డి గారి విజయాన్ని ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి పనిచేయాలని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి గారే అయినప్పటికీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిననే భావనతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, పట్టభద్రులు, కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఒక్క పట్టభద్రుడి ఓటును కూడా నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఓటు పార్టీ విజయానికి కీలకమని అన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటాన్ని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ, పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మరింత ఐక్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో పట్టభద్రులను కలిసి ఓటు నమోదు, ఎన్నికలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సన్నాహక సమావేశాల్లో జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సర్పంచులు, పట్టభద్రులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




