Miryalaguda: మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు భాస్కర్‌రావు చొరవ చూపాలి!

Miryalaguda: మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చొరవ చూపాలని జిల్లా సాధన సమితి మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావును కోరింది.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 18 Nov 2026 11:19 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు భాస్కర్‌రావు చొరవ చూపాలి!

మిర్యాలగూడ: మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కోరింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావును కలిసి జిల్లా ఏర్పాటు అంశంపై వినతిపత్రం అందజేసి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు తమ్మడపైన అర్జున్, మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి, దశరథ నాయక్, ఎండీ షోయబ్, వీర కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను కలుపుకొని సుమారు 8 లక్షలకు పైగా జనాభా, 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సమితి పేర్కొంది. అదేవిధంగా ఐదు మున్సిపాలిటీలు, 17 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని వివరించింది.

జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు మిర్యాలగూడ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన రైస్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా ఉన్నాయని పేర్కొంది.

2016లో నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అప్పటి మాజీ శాసనసభ్యులు రేపాల శ్రీనివాస్‌కు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు అంశంపై విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేసింది. అయినప్పటికీ నేటికీ జిల్లా ఏర్పాటు కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి విజ్ఞప్తి చేసింది.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA