Suryapet: ప్రతి గ్రామంలో ఉపాధి పనులు జరగాలి: కలెక్టర్ తేజస్!
Suryapet: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి పనులు జరగాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ గురువారం ఆదేశించారు.
Suryapet: ప్రతి గ్రామంలో ఉపాధి పనులు జరగాలి: కలెక్టర్ తేజస్!
సూర్యాపేట: జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పని కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. హుజూర్నగర్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి గ్రామంలో పనుల జాబితా సిద్ధంగా ఉండాలని, రోజూ ఉపాధి పనులు జరిగేలా చూడాలని సూచించారు. పని చేసే ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ.300 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధి పనులపై కూలీల సమీకరణ సరిగా లేదని కొన్ని గ్రామాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. మేట్ల ద్వారా ఒకటి, రెండు రోజుల ముందుగానే కూలీలకు సమాచారం అందించి పనులకు రప్పించాలన్నారు. కాల్వల తవ్వకం, చెరువుల పనులు, మొక్కలు నాటడం తదితర పనులు చేపట్టాలని చెప్పారు. ఉదయాన్నే పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంటలోపు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. కూలీల హాజరు, పనుల నిర్వహణ క్షేత్రస్థాయిలో కనిపించాలని స్పష్టం చేశారు.
వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యానవనం, పశుసంవర్ధక, తాగునీరు, మత్స్య, అటవీ శాఖల ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ పనులను గుర్తించి ప్రతిపాదించాలని సూచించారు. జలసిరి, వ్యక్తిగత, సామూహిక పనులతోపాటు స్వచ్ఛభారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఐహెచ్హెచ్ఎల్ పథకం కింద మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సామూహిక పారిశుద్ధ్య సముదాయాలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించేలా పనులను గుర్తించాలని చెప్పారు.
రాబోయే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాగునీటి అవసరాలకు సంబంధించి అంచనాలు రూపొందించినట్లు తెలిపారు. వాటికి త్వరలో అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఆవాసానికి, ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని సూచించారు. పైపుల ద్వారా నీరు సరఫరా కాని ప్రాంతాల్లో అత్యవసరంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఉపాధి పనుల్లో వెనుకబడిన గ్రామాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. గ్రామపంచాయతీల వారీగా, మండలాల వారీగా పురోగతిని సమీక్షించి నివేదికలు అందించాలని డీపీఓను ఆదేశించారు. తదుపరి సమావేశంలో పనుల పురోగతిని మరింత లోతుగా సమీక్షిస్తామని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు అవసరమైన సమయంలో ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




