Nalgonda: ఐటీ టవర్‌లో స్కిల్ కోర్సులు పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విస్తరించాలని, ఐటీ టవర్‌లో స్కిల్ కోర్సులు పెంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీల్లో ఆదేశించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 3 Nov 2026 7:43 PM IST
Nalgonda
X

Nalgonda: ఐటీ టవర్‌లో స్కిల్ కోర్సులు పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: దేశ నవనిర్మాణంలో నైపుణ్యం కలిగిన యువత కీలక పాత్ర పోషిస్తారని, విద్యార్థుల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.మంగళవారం ఆయన నల్గొండ పట్టణంలోని ఐటీ టవర్‌ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను, కంపెనీల పనితీరును పరిశీలించారు.

తొలుత భవనంలోని పీఎం విశ్వకర్మ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ అందించారు? ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని? నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 500 మందికి శిక్షణ అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నాగార్జున కళాశాల, ఇతర డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు పెద్ద సంఖ్యలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని చెప్పారు.

విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా ప్రోత్సహించాలని అన్నారు .స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సుల శిక్షణ పొందే విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.అనంతరం ఐటీ టవర్ మేనేజర్ ఎన్. ప్రకాశ్‌ తో మాట్లాడుతూ ఐటీ టవర్‌లో ఎన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి? వాటి నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు వెయ్యి కంపెనీలు ఉన్నట్లు మేనేజర్ వివరించగా, నిర్వహణ ఖర్చులు చెల్లించని సంస్థల నుంచి తప్పనిసరిగా మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు.

తదుపరి విజువల్ ఎఫెక్ట్స్, వీడియో ఎడిటింగ్ తరగతులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు? ఏఐ టూల్స్‌ను ఏ విధంగా వినియోగిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని, ఐటీ టవర్‌లోని సంస్థలు నిబంధనల ప్రకారం నిర్వహణ ఖర్చులు తప్పనిసరిగా చెల్లించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఐటీ టవర్ డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్. ప్రకాశం, ఇతర కంపెనీ అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET