Suryapet: నకిలీ బంగారం కలకలం.. బ్యాంకు అప్రైజర్ పరారీ!
Suryapet: సూర్యాపేటలోని ఓ బ్యాంకులో అప్రైజర్ తన భార్యతో కలిసి నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షలాది రూపాయలు కాజేశాడు.
Suryapet: నకిలీ బంగారం కలకలం.. బ్యాంకు అప్రైజర్ పరారీ!
Suryapet: సూర్యాపేట పట్టణంలో నకిలీ బంగారం గోల్డ్ లోన్ల కుంభకోణం కలకలం రేపుతోంది. బంగారం నాణ్యతను పరీక్షించాల్సిన బ్యాంకు ఉద్యోగే అసలు సూత్రధారిగా మారాడు. తనకు తెలిసిన వ్యక్తితో పాటు, ఏకంగా తన భార్య పేరుపై కూడా నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షలాది రూపాయల రుణాలు కాజేశాడు. మేనేజర్ ఫిర్యాదుతో గుట్టురట్టు కావడంతో, సదరు ఉద్యోగి తన గోల్డ్ షాపుకు తాళం వేసి భార్యతో సహా పరారయ్యాడు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని చర్చి కాంపౌండ్ సమీపంలో ఉన్న ఓ బ్యాంకులో నకిలీ బంగారం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. బంగారం అసలుదా, నకిలీదా అని తేల్చి చెప్పాల్సిన బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగే (అప్రైజర్) ఈ భారీ మోసానికి తెరలేపాడు.
నిబంధనలకు తూట్లు పొడుస్తూ తనకు తెలిసిన ఓ వ్యక్తి పేరుపై ఏకంగా ఐదు గోల్డ్ లోన్లు మంజూరు చేయించాడు. అంతటితో ఆగకుండా, ఏకంగా తన భార్య పేరుపై కూడా నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరో లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఆరు ఖాతాల ద్వారా వచ్చిన లక్షలాది రూపాయల నగదును సదరు ఉద్యోగే కాజేసినట్లు తెలుస్తోంది.
తాకట్టు పెట్టిన బంగారంపై అనుమానం రావడంతో బ్యాంకు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించగా, అవన్నీ నకిలీ ఆభరణాలని తేలింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ వెంటనే సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేనేజర్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి రాగా, అసలు విషయం బయటపడిందని గ్రహించిన సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరారయ్యాడు. సూర్యాపేట మున్సిపల్ కేంద్రంలో తాను నడుపుతున్న గోల్డ్ షాపుకు తాళం వేసి, భార్యతో సహా ఉడాయించాడు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.
ప్రస్తుతం ఈ ఘటనపై సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న బ్యాంకు ఉద్యోగి, అతని భార్యతో పాటు నకిలీ బంగారం పెట్టిన మరో వ్యక్తి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. నిందితులు పట్టుబడితే బ్యాంకుకు జరిగిన అసలు నష్టం ఎంత, ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉంది అనే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.




