Suryapet: సూర్యాపేటలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
Suryapet: సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Suryapet: సూర్యాపేటలో రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం!
సూర్యాపేట: సంయుక్త కిసాన్ మోర్చా (SKM) జాతీయ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కుడకుడ రోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ప్రదర్శనగా వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, రైతును వ్యవసాయానికి దూరం చేస్తున్నారని, కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
ఢిల్లీలో గత రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, దొడ్డిదారిన వాటిని మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
రైతులు అనేక సంవత్సరాలుగా మద్దతు ధర చట్టం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, వద్దన్నా నూతన విత్తన చట్టాన్ని తీసుకొచ్చి రైతులను మరింత అప్పుల్లోకి నెట్టేలా చేశారని అన్నారు.
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని, కరువు సహాయక పనులు చేపట్టాలని, పాత పద్ధతిలోనే ఉపాధి హామీ కొనసాగించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల నష్టపరిహారం అందించాలని, 60 సంవత్సరాలు నిండిన రైతులకు నెలకు 10,000 పెన్షన్ అందించాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు మండారి డేవిడ్ కుమార్, AIPKS జిల్లా కార్యదర్శి పేర్ల నాగయ్య, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా కార్యదర్శి నల్లెడ మాధవరెడ్డి, సీపీఐ రైతు సంఘం నాయకులు ఈర్ల వీరన్న, రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు బత్తుల గురువయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, సిఐటియు జిల్లా నాయకులు ఏకలక్ష్మి తదితరులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, AIKMS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, కొలిశెట్టి యాదగిరిరావు, దంతాల రాంబాబు, మందటి రాంరెడ్డి, కొప్పుల రజిత, అలుగుబెల్లి వెంకటరెడ్డి, నరసింహారావు, నల్లగొండ నాగయ్య, బొల్లె వెంకన్న, కిరణ్, సింహాద్రి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




