Suryapet: అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు.
Suryapet: అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలి: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య!
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2 నుండి ఆగస్టు 20 వరకు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పాదయాత్రలో వెలుగుచూసిన సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతోందని, ఫాగింగ్ చేయకపోవడంతో ప్రజలు మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలో 60 ఫీట్ రోడ్ ను కలెక్టరేట్ రోడ్ కు కలుపుతూ హైటెక్ బస్ స్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. కొత్త బస్ స్టాండ్ నుండి ఇమ్లీబండ ఫ్లైఓవర్ వరకు, గాంధీ బొమ్మ నుండి కుసుమంచి గూడెం వరకు రోడ్లను నాలుగు లైన్లుగా విస్తరించాలన్నారు.
పట్టణం చుట్టూ ఉన్న చెరువులను పునరుద్ధరించి తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలని, అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, జిల్లా కమిటీ సభ్యులు కారింగుల వెంకన్న, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, టియుసిఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు.




