Chandur: చండూరులో బీఆర్ఎస్ ధర్నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్
Chandur: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై చండూరులో బీఆర్ఎస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు.
Chandur: చండూరులో బీఆర్ఎస్ ధర్నా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫైర్
Chandur: నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో నాలుగు వారాలైనా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఈ పథకాన్ని ఎత్తేయాలన్నదే ప్రభుత్వ కుట్ర అని దీని ద్వారా స్పష్టమవుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తులం బంగారం హామీని ఏ గంపలో వేసిందని నిలదీశారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీ పేరుతో కేవలం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బొమ్మలు ముద్రించుకుని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తే మంత్రి పదవి వస్తుందని ఆయన భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి వల్ల ఈ ప్రాంతానికి అరిష్టం పట్టిందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేక రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని సవాల్ విసిరారు.




