Miryalaguda: మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అరెస్ట్!
Miryalaguda: మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ధర్నా. పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత.
Miryalaguda: మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అరెస్ట్!
Miryalaguda: నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ధర్నాకు దిగారు.
అసెంబ్లీ వద్ద తమ పార్టీ ఎమ్మెల్యేల అరెస్టును బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మిర్యాలగూడలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడంతో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను విరమించాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. అయితే ఆందోళన కొనసాగడంతో పోలీసులు ధర్నాను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా మొదలైన ఈ ఆందోళనతో మిర్యాలగూడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.




